మద్యం. ఇది ఒక మత్తు. ఇది ఒక విపత్తు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాలు కోల్పోయిన వారిని మనం నిత్యం టీవిలలో, పేపర్లలో చూస్తూనే వున్నాం. ఏటా మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్షకు పైనే. ఇక ప్రపంచవ్యాప్తంగా మద్యం సేవించి వాహనం నడిపి ప్రాణాలు పోయిన వారి సంఖ్య సుమారుగా 1.3 కోట్లు. దీనికి ఏది పరిష్కారం, ఈ ప్రమాదాలను అరికట్టలేమా….అంటే అరికట్టవచ్చు అనే అంటున్నారు అమెరికాలోని పరిశోధకులు.
అమెరికాలోని ఒక ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థ అయిన (Driver Alcohol Detection System for Safety) DADSSలోని పరిశోధకులు ఒక కొత్త సాంకేతిక పరికరాన్ని కారుకి అమర్చడం ద్వారా మద్యం సేవించిన వారు వాహనం నడపకుండా చేస్తుంది. మద్యం సేవించిన డ్రైవర్లను వారి ఊపిరి మరియు స్పర్శ ఆధారంగా పరీక్షిస్తుంది. ఈ పరికరాన్ని కారులో అమర్చడం ద్వారా దీనిలోని సెన్సర్ డ్రైవర్ ఊపిరిలోని ఇధనాల్ టు కార్బన్ డైఆక్సైడ్ (carbon dioxide) నిష్పత్తిని లెక్క కడుతుంది. ఆ నిష్పత్తి సురక్షిత స్థాయిని మించి వుంటే కారును స్టార్ట్ కానివ్వదు. ఈ పరికరంలోని టచ్ పాడ్, డ్రైవర్ చేతి స్పర్శ ద్వారా వారి చర్మం లోని ఇధనాల్ స్థాయిని స్పెక్ట్రోస్కోపీ ద్వారా లెక్క కడుతుంది. ఇది కూడా సురక్షిత స్థాయిని మించితే కారును స్టార్ట్ కానివ్వదు. ఈ పరికరం రాబోయే 5 నుంచి 8 ఏళ్ళల్లో అందుబాటులోకి వస్తుంది అంటున్నారు అక్కడి పరిశోధకులు.
కేవలం సాంకేతిక పరిజ్ఞనం వుంటే సరిపోదు. ప్రపంచ దేశాలన్నిటా ఇటువంటి పరిశోధనలు జరగాలి. ఇటువంటి ఆవిష్కరణలకు ప్రభుత్వం చేయూతనివ్వాలి. ఇటువంటి ఉత్పత్తులకు ప్రోత్సాహకాలను ప్రకటించాలి. ప్రజా శ్రేయస్సు కోసం కఠీనమైన చట్టాలు చేసి వాటిని ఖచ్చితంగా అమలు చేస్తేనే ఇటువంటి పరిశోధనలకు ప్రయోజనం వుంటుంది.