ప్రస్తుతం వేరబుల్ పరికరాలదే హవా. అయితే ఈ వేరబుల్ పరికరాలు ఎక్కువగా ఆరోగ్య రంగంలో అందుబాటులోకి వచ్చాయి. కేవలం ఒక వేరబుల్ పాచ్ వేసుకుని గుండె పని తీరు, ఊపిరితిత్తుల పని తీరు మొదలైనవి చెప్పే పరికరాలు వచ్చాయి. కానీ ఈ వేరబుల్స్ ను డిస్ప్లే కోసం ఉపయోగించడం మనం గూగుల్ గ్లాస్ ద్వారానే మొదలైంది. ఈ గూగుల్ గ్లాస్ తో మన ఫోన్ లో ఏం చూడాలి అనుకున్న ఈ డిస్ప్లే ద్వారా మన కళ్ళ ముందరే ప్రత్యక్షం అవుతుంది. ఈ ఆలోచన బాగానే ఉన్నా ఈ గూగుల్ గ్లాస్ ధర ఎక్కువ కావడం, దీనిని ఒక యాప్ ద్వారా ఉపయోగించాల్సి రావడం, ఆ యాప్ యూసర్లకు అంతగా అక్కరకు రాకపోవడం కూడా గూగుల్ గ్లాస్ అంతగా ప్రాచుర్యం లోకి రాకపోవడానికి కారణం.
కానీ ఈ వైఫల్యం నుంచి మరో సంస్థ పాఠాలు నేర్చుకుంది. దీనిలోని పరిమితులను అధిగమిస్తూ Vufine అనే కొత్త వేరబుల్ డిస్ప్లే మార్కెట్ లోకి వచ్చింది. దీనిని ఉపయోగించడానికి ఎలాంటి యాప్ లు అవసరం లేదు. కేవలం ఈ Vufine పరికరాన్ని మీ కళ్ళ జోడు కాలికి పెట్టుకుంటే మీ మొబైల్ స్క్రీన్ మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. అంటే మీ కళ్ళ ముందు రెండో స్క్రీన్ లా ఉంటుంది. సరే, దీనితో ఏమిటి లాభం అనుకుంటే – దీనితో మీరు మీ స్క్రీన్ వైపు చూడాల్సిన అవసరం లేకుండా కళ్ళ ముందు కనిపిస్తుoటే మొబైల్ ను ఉపయోగించచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే గూగుల్ మ్యాప్ మీ కళ్ళ ముందుకు వస్తుంది. మీరు ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు మీ చుట్టూ ప్రపంచాన్ని గమనించుకుంటూనే మీ మొబైల్ లో వీడియో చూసుకోవచ్చు. ముఖ్యంగా దీని వల్ల మెడ వంచి మొబైల్ చూసే బాధ తప్పుతుంది. అంతేనా మీ కార్యాలయం లో ఏదైనా ఒక ప్రెజంటేషన్ ఇవ్వాలంటే మీ ఫోన్, లాప్టాప్, టాబ్లెట్ కు దీనిని కనెక్ట్ చేసుకుని అనర్గళంగా మాట్లాడవచ్చు. ఇక దీన్లో HDMI డిస్ప్లే ఉండడం విశేషం. ఇన్ని లాభాలు ఉన్న ఈ డిస్ప్లే ఎలా ఉంటుందో ఎలా పని చేస్తుందో చూద్దాం.
ఈ Vufine లో రెండు భాగాలు ఉన్నాయి. అవి డాకింగ్ స్టేషన్, రెండవది ఈ డిస్ప్లే. ఈ డాకింగ్ స్టేషన్ ను మీ కళ్ళ జోడుకు కాలికి పెట్టుకుని ఆ తరువాత ఈ డిస్ప్లే ను పెట్టుకోవాలి. ఆ డాకింగ్ స్టేషన్ లోని అయస్కాంతo వల్ల ఈ డిస్ప్లే ఆ స్టేషన్ కు టక్కున అతుక్కుంటుంది. అక్కడి నుంచి పడిపోవడం, జారి పోవడం జరగదు. ఆ తరువాత ఈ డిస్ప్లే ను మీకు నచ్చినట్టు తిప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే చివర ఆన్/ఆఫ్ బటన్ ఉంటుంది. ఈ Vufine కేబుల్ ను మీ ఫోనుకు- ఈ డాకింగ్ స్టేషన్ కు కనెక్ట్ చేసుకుని ఈ డిస్ప్లే ఆన్ చేస్తే చాలు, మన మొబైల్ స్క్రీన్ మన కంటి ముందు ప్రత్యక్షం అవుతుంది. ఇక దీంట్లో three modes of viewing ఉన్నాయి. అవి Fit, Standard, Zoom. దీంతో ఎలా కావాలంటే అలా ఒక వీడియో ను చూసుకోవచ్చు. ఇది సుమారు 90 నిముషాలు పని చేస్తుంది. ఆ పైన మళ్ళీ దీనిని ఛార్జ్ చేయాలి.
సరే ఇది కళ్ళ జోడు లేని వారికి ఎలా అంటే, వారికి నాన్ ప్రిస్క్రిప్షన్ గ్లాస్ లు ఈ సంస్థ కొనుగోలు చేసేటప్పుడే ఇస్తుంది. ఇక దీని ధర $149-$200 వరకు ఉంది.