మాట ఎంతో మధురమైనది. అయితే మనం నోరు తెరిస్తే గల గలా మాట్లాడటం వల్ల బహుశా దానికి ఉన్న ప్రాధాన్యత మనకు తెలియకపోవచ్చు. కానీ పలు రకాల దీర్ఘకాలిక రోగాల వలన ప్రపంచంలో కొందరు మాటను కోల్పోతుంటారు. ఉదాహరణకు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ యే ఇందుకు ఉదాహరణ. ఆయన తన 21వ ఏటనే ఒకలాంటి న్యురోలాజికల్ డిసార్డర్ వలన పూర్తి శరీరమే కాదు మాట కూడా పడిపోయింది. ఆయన తన లాంటి వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక కంప్యూటర్ ద్వారా మాట్లాడగలుగుతున్నారు.
కానీ అది ఎలా ఉంటుంది అంటే, జీవం లేని ఒక కంప్యూటర్ ప్రీ రికార్డెడ్ గొంతు వినిపిస్తుంటుంది. ఈయనే కాదు ఇటువంటి వారు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. ఒక్క అమెరికా లోనే ఇటువంటి జబ్బుతో మాట కోల్పోయినవారు రెండు కోట్లకు పైగా ఉన్నారు అంటే ఆశ్చర్యం కలుగుతుoది. వీళ్ళు కనీసం ఒక్క మాట కూడా పలకలేరు. అ, ఓ అనేటటువంటి శబ్దాలు మాత్రమే చేయగలరు. ఇటువంటి వారికి, వారికంటూ ఒక ప్రత్యేకమైన గొంతునిస్తే, అది వారి జీవితాల్లో ఎంతో మార్పునీ మరెంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది.
సరిగ్గా ఇందుకే అమెరికా లోని బెల్మొంట్ కు చెందిన ప్రొఫెసర్ రూపాలి పటేల్, 2014 లో అక్కడి నేషనల్ సైన్సు ఫౌండేషన్ వారి సాయంతో VocaliD అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి గొంతును డొనేట్ చేసిన వారి ద్వారా అవసరం ఉన్న ఇటువంటి వారికి గొంతునిస్తున్నారు.
రూపాలి ప్రకారం ప్రతీ గొంతులో ఆ వ్యక్తి యొక్క వయసు, లింగం, ఆరోగ్యం, వ్యక్తిత్వం వంటివి ఎన్నో దాగి ఉంటాయి. అలాగే ప్రతీ గొంతు, మరో వ్యక్తి గొంతుకు భిన్నంగా ఉంటుంది. ఏదైనా ఇటువంటి జబ్బు ఉన్న ఒక వ్యక్తికి సంబంధం లేని జీవం లేని గొంతు వారి వ్యక్తిత్వాన్ని సమాధి చేస్తుంది. అందుకే ఎవరైనా ఒక దాత గొంతును వారి వయసు, లింగం, వారి మాట తీరు సరిపోయే వ్యక్తికి ఇస్తారన్న మాట. అంటే ఏ విధంగా అయితే అవయవ మార్పిడికి రోగి వయసు, శరీరానికి సరిపడే దాత అవసరమో అలాగన్నమాట. ఇది అర్ధం కావాలంటే మరి కొంచెం లోతుకు వెళ్దాం. మాట వ్యక్తం అయ్యేటప్పుడు ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి స్వర పేటిక మరొకటి దాని నుంచి వ్యక్తమయ్యే శబ్దాలు, మన నోట్లోని ఫిల్టర్ల నుంచీ బయటకు రావడం. ఇవి రెండూ కలిస్తేనే మనకు మాట బయటకు వస్తుంది. అయితే పైన చెప్పినటువంటి వ్యాధి ఉన్న వారికి రెండవ ప్రక్రియ జరగదు.
అందువల్ల, VocaliD ఎవరైనా ఒక దాతకు ఇంగ్లీష్ లో కొన్ని వ్యాక్యాలను ఇచ్చి వాటిని ఉచ్చరింప చేసి దానిని రికార్డు చేసి, డాని నుంచీ ఆ దాత యొక్క శబ్దాలను పలికే తీరును, పద్ధతిని సంగ్రహించి, ఆ గొంతును అవసరమైన వ్యక్తికి జత చేస్తారన్నమాట. తద్వారా ఆ రోగికి తన స్వర పేటిక నుండి ఉత్పన్నమయ్యే గొంతుతో, దాత యొక్క పదాలను పలికే ప్రక్రియను కలుపుని ఒక ప్రత్యేకమైన గొంతు తయారవుతుంది. ఇలా ఈ సంస్థ దాతలను ఆహ్వానించి వారి గొంతుతో ఎంతో మంది జీవితాల్లో తమదైన మాటను పలికించారు. ఇందుకోసం ఈ సంస్థ స్వచ్చందంగా దాతలను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం మీరు చేయాల్సింది వారి వెబ్ సైట్ లోకి వెళ్లి మీ గొంతుతో కొన్ని వ్యాక్యాలను పలకడమే.
మనిషికి ఎన్ని వైకల్యాలు ఉన్న అదే మనిషికి వాటిని తొలగించాలి అనే సంకల్పం, అర్హత ఉంటే ఏ వైఫల్యమూ పెద్దది కాదు ఏ వైకల్యము తొలగించలేనిది కాదు.