చరవాణి (Cell phone). ఈ శతాబ్దపు ముఖ్యమైన ఆవిష్కరణ అని చెప్పచ్చు. ఇది కేవలం చరవాణి లా మిగిలి పోకుండా ఎన్నో సేవలు అందిస్తోంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఎన్నో విధాలు అయిన సేవలు కేవలం ఈ చరవాణి ద్వారా మన చేతుల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఇక మరో అడుగు ముందుకేసి వైద్య పరీక్షలు సైతం అధునాతన సాంకేతిక విజ్ఞ్యానంతో ఈ సెల్ ఫోన్ ద్వారా అందుబాటు లోకి రాబోతోంది. ఇక ఏమా వైద్య పరీక్షలు, దాని సంగతులు తెలుసుకుందాం.
మలేరియా. ఇప్పటికి ఇది ఏటా కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. WHO (World Health Organaisation) లెక్కల ప్రకారంగా ఈ మలేరియా (Malaria) 2013 లో ప్రపంచవ్యాప్తంగా 5,84,000 మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక అంతగా అభివృద్ధి చెందని దేశాల్లో దీని ఉధృతి మరీ ఎక్కువ. అటువంటి మలేరియా ను పూర్తిగా అరికట్టాలంటే ముందు జాగ్రత్త చర్యల తో పాటు ముఖ్యమైంది రోగ నిర్ధారణ.
అసలు ఏ చికిత్స లో నైనా రెండు భాగాలు ఉంటాయి. అవి 1. రోగ నిర్ధారణ 2. వైద్యo. అసలు రోగ నిర్ధారణ ఎంత త్వరగా జరిగితే రోగికి అంత మంచిది. దీనిని దృష్టిలో పెట్టుకొనే అమెరికా లోని టెక్సాస్ కు చెందిన Gerard Cote, professor of biomedical engineering, ఒక విప్లవాత్మకమైన పరికరాన్ని తయారు చేసారు. అదే ఈ MOPID (mobile-optical-polaraisation imaging device).
ఇది చూడడానికి మన సాధారణ ఫోన్ కేస్ లా ఉంటుంది. ఈ మైక్రోస్కోప్ (MOPID) ఫోను లోని కెమెరా లెన్స్ ఆధారంగా పని చేస్తుంది. ఇది మనిషి వెంట్రుక కంటే 10 రెట్లు పలుచనైన వస్తువులు లేదా జీవులను హై రీసోల్యుషన్ (high resolution) ఫోటోలు తీయగలదు. ఈ పరికరం లో ఉండే కార్ట్రిడ్జ్ లో మనిషి రక్తపు బొట్టు వేయగానే ఈ పరికరం లోని పోలరైజ్డ్ కాంతి ఆ రక్తంలోని hemozoin crystals ను వెతుకుతుంది. ఎందుకంటే మలేరియా పరాన్నజీవి (parasite) కారణంగా ఇవి రక్తం లోకి వచ్చి చేరుతాయి. అందువల్ల రక్తం లో ఇవి ఉన్నట్లైతే ఫోన్ కెమెరా లోంచి ఇవి ప్రకాశవంతమైన చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తాయి. అంతే, దీనితో ఖచ్చితంగా ఆ వ్యక్తికి మలేరియా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లే.
సంప్రదాయ మైక్రోస్కోప్ ల తో పోల్చితే ఈ MOPID తక్కువ ఖర్చు తో, ఖచ్చితమైన, త్వరితగతిన ఫలితాలను ఇస్తుంది. దీని వల్ల రోగి కి అనవసరమైన పరీక్షలు తగ్గుతాయి. సామాన్యునికి ఎంతో సమయం మరియు డబ్బు ఆదా అవుతుంది. ఇది అందుబాటు లోకి వస్తే ఒక విప్లవానికి నాంది పలుకుతుంది. ఎందుకంటే శిక్షణ పొందిన వైద్య సిబ్బంది లేకుండా, అందుకు తగ్గ పరికరాలు లేకుండా వైద్య పరీక్షను సామాన్యునికి అందుబాటులోకి తేవడం సామాన్యమైన విషయం కాదు. ఇంకా ఆశక్తికరమైన అంశం ఏమిటంటే ఈ MOPID మొబైల్ నెట్వర్క్ లేకపోయినా పని చేస్తుంది. ఈ MOPID ధర కేవలం $10.
ఈ పరికరాన్ని అన్ని దేశ ప్రభుత్వాలు సామాన్యులకు అందుబాటులోకి తేవాలి. అప్పుడే మలేరియా ను పూర్తిగా తరిమి కొట్టచ్చు.