వృద్ధాప్యం. ఇది జీవితపు చివరి మెట్టు. ఈ వృద్ధాప్యం లో కలిగే అనారోగ్యాలు అన్ని ఇన్ని కావు. కొందరికి మందులతో నయమయ్యే రోగాలు వస్తే, మరి కొందరికి ఎంత వైద్యం చేసినా నయం కావు. వృద్ధాప్యం లో కూడా ఎటువంటి అనారోగ్యాల బారిన పడని వారు నిజంగా అదృష్టవంతులే. అయితే ఇటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. అధిక శాతం మంది అనారోగ్యంతో బాధ పడుతూనే ఉంటారు. 80 లు దాటిన వారికి ఏ తోడు లేకుండా ఆసుపత్రికి వెళ్ళడం అంటే చాలా కష్టం తో కూడుకున్న పనే. శరీరం సహకరించదు, కనీసం వైద్యుని ముందు కూడా ఎక్కువ సేపు కూర్చోలేరు. విదేశాల్లోని వారికైతే ఇది మరీ ఇబ్బంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా వారంతట వారే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అటువంటి వారు గుండె జబ్బులతో బాధపడేవారైతే వారికి సరైన సమయంలో వైద్య సహాయం అందడం చాలా కీలకం.
ఈ నేపధ్యంలో అమెరికాలోని మిన్నెసోటా కు చెందిన St.Jude Medical అనే ఒక సంస్థ హృద్రోగులకు (heart patients) ఆసుపత్రులకు వెళ్ళనవసరం లేకుండా, ఇంటిలోనే వైద్య సహాయం అందేటట్టు చేసింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా లోని సౌత్ జెర్సీ లో ఒక అత్యాధునిక సాంకేతిక పరికరాన్ని ఒక మహిళకు అందించి ఆమెకు వైద్య సహాయం అందేటట్టు చేసారు. అదే ఈ CardioMEMS. ఇది ఒక సెన్సర్ సహాయంతో ఒక మిషనుకు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ సెన్సర్ ను ఒక రకమైన గుండె జబ్బుతో బాధ పడేవారి ఒంట్లోకి పంపించి గుండె లోని ఒక రక్త నాళానికి అమరుస్తారు. ఇది ఒక 45 నిమిషాల పాటు సాగే ప్రక్రియ. ఈ సెన్సర్ పూర్తిగా వైర్లెస్. ఈ సెన్సర్ కు తత్ సంబంధమైన మిషనుకు ఎలాంటి వైర్ లు ఉండవు. అందువల్ల దీనిని అమర్చుకున్న వ్యక్తికి దీనివల్ల ఎలాంటి పరిమితులు ఉండవు.
ఇప్పుడు ఆ వ్యక్తి గుండె లోని ఈ సెన్సర్ Pulmonary Edema ను గుర్తిస్తుంది. అంటే, మనిషి ఊపిరితిత్తుల లో pressure ఎక్కువ అయితే దాని వల్ల ఆ వ్యక్తికి ఊపిరి అందకపోవడం, నడవలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనిని ఇలాగే వదిలేస్తే గుండె పోటుకు సైతం దారి తీస్తుంది. ఇప్పుడు ఈ CardioMEMS, వ్యక్తిని పరీక్షిస్తున్న వైద్యునికి ఈ వివరాలను పంపుతుంది. దానిని బట్టి వెంటనే ఆ వైద్యుడు ఆ రోగికి ఫోన్ చేసి తీసుకోవాల్సిన మందులను సూచిస్తాడు. దీని వల్ల వయసు పై బడిన ముసలి వారు ఆసుపత్రికి రావాల్సిన అవసరం చాలా మేర తగ్గిపోతుంది.
ఈ CardioMEMS ను అమెరికా లోని కొన్ని రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నారు. దీనిని ఆ దేశపు FDA (Food and Drug Administration) సైతం ఆమోదించింది.
ఇటువంటి పరికరాలను మనమూ ఉపయోగించాలంటే ముందు రోగుల పట్ల ఆసుపత్రులు బాధ్యత తో ప్రవర్తించాలి. డబ్బు కంటే రోగి క్షేమాన్ని కోరుకుంటేనే తప్ప ఇటువంటివి మన దేశం లో ఉపయోగించలేము.