వైద్యం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఆ ఫలాలు అందని వారు సైతం నాణానికి ఆవల ఉన్నారు. కారణం ఆయా దేశాల భౌగోళిక, ఆర్ధిక పరిస్థుతులు ఇంకా ఏమైనా కావచ్చు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో కనీస వైద్య సదుపాయాలకు దూరంగా ఊళ్లకు ఊళ్లు బ్రతుకుతున్నారు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. మరి అటువంటి వారికి వైద్య చికిత్సల సంగతి తరువాత ముందు వైద్య నిర్ధారణ చేయాలంటే అవసరమైన పరికరాలు, నిపుణులు కూడా ఉండరు. అటువంటి వారి కోసం ప్రపంచం నలుమూలలా పరిశోధకులు తేలికైన, సులభమైన రోగ నిర్ధారణా పద్ధతులను కనిపెడుతున్నారు.

అమెరికా లోని Purdue University కి చెందిన Ramses V. Martiez తన బృందంతో కలిసి అత్యంత సులభంగా వైద్య పరీక్షలు చేసే విధంగా ఒక పేపర్ డయాగ్నొస్టిక్ టెస్ట్ ను రూపొందించారు. దీనితో రక్త హీనత, మూత్ర పిండ సమస్యలు, ఇంకా పలు రకాల రోగాలను ఈ పేపర్ టెస్ట్ తో నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ పేపర్ టెస్ట్ ను SPED (Self powered, Paper based electrochemical analyses) అని అంటారు. ఇక ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం.

ఒక చిన్న విజిటింగ్ కార్డు పరిమాణంలో ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ కింద సన్నని పొరలా ఒక Triboelectricgenerator ఉంటుంది. అంటే, ఒత్తిడి తోనే చిన్న పాటి voltage కు కారణం అవుతుందన్న మాట. దీని మీద ఒక రక్తపు చుక్క వేసి దీనిని వొత్తితే చాలు పరీక్ష జరిగిపోతుంది. ఈ కార్డు మీద గుండ్రంగా ఉండే ప్రదేశంలో మన రక్తపు చుక్కను వేయవచ్చు, లేదా ఇప్పటికే సేకరించిన రక్తపు నమూనాలో ఈ కార్డు ను ముంచితే, దీనిలో నలువైపులా నాలుగు self pippette arrays ద్వారా ఆ గొట్టాల్లోకి ద్రవాన్ని పీల్చుకుoటుంది. ఈ కార్డు మధ్యలో చతురస్రాకారంలో కొన్ని రంగురంగుల గళ్ళు ఉంటాయి. ఈ కార్డును వత్తితే జరిగే విద్యుత్-రసాయన చర్య వల్ల ఈ పేపర్, రక్తంలో ఉండే కొన్ని రకాల బయోమార్కర్లను గుర్తించి దానికి అనుగుణంగా, ఈ గళ్ళు రంగు మారుతుంటుంది. అలా మారిన రంగును సెల్ ఫోన్ తో ఫోటో తీసి దీనికి సంబంధించిన యాప్ తెరచి చూస్తే, ఆ యాప్, మనం తీసిన ఫోటోలో కనపడ్డ ఆరోగ్య సూచనలను చెప్పేస్తుంది.

పేపర్ కాబట్టి అత్యంత తేలికగా, సులభంగా అభివృద్ధి చెందని దేశాల్లో, లేదా వైద్య సదుపాయం దూరంగా ఉండే మంచు ప్రదేశాల్లో, మిలిటరి లో ఉపయోగిoచడానికి వీలుగా ఉంటుంది. అంతే కాదు భవిష్యత్తులో ఈ SPED లో HIV, మలేరియా వంటి రోగాలను సైతం కనిపెట్టే విధంగా దీనిని రూపొందించాలి అనే ఆలోచనలో ఉంది ఈ బృందం. ఈ పరిశోధనను ఆగష్టు 22నాటి ‘Advanced Material Technologies’ లో ప్రచురించారు.

Courtesy