ఈ శతాబ్దంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఆధారంగా విద్య, వైద్యం, ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్స్ వంటి ఎన్నో రంగాల్లో కొత్త ఆవిష్కరణలు, ఇంకా పెను మార్పులు జరుగుతున్నాయి. పాత పద్ధతులను సమూలంగా మార్చేసి కొత్త పద్ధతులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ కోవలోకే రానుంది ఈ సోలార్ కారు. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్…ఇప్పుడు సోలార్ కార్. దీని కధేంటి తెలుసుకుందాం.
నెదర్ల్యాండ్స్ లోని EUT (Eindhoven University of Technology) కి చెందిన విద్యార్థులు దీనిని తయారు చేశారు. పేరు లోనే తెలుస్తుందిగా ఇది పూర్తిగా సౌర శక్తితోనే నడిచే కారు. ఇందులో ఒకరో ఇద్దరికో చోటు వుంటుంది అనుకుంటే పొరపాటు. ఇది ఒక చిన్న కుటుంబానికి సరిపోయే విధంగా దీనిని రూపొందించారు. దీని పేరు “స్టెల్లా లక్స్” (Stella Lux) సోలార్ కార్. ఈ కారును ఆ యూనివర్సిటీ కి చెందినా 21 మంది విద్యార్థులు సుమారు 18 నెలలు కష్టపడి తయారు చేసారు.
ఈ కారులోని 62.4 చదరపు అడుగుల మేర సోలార్ సెల్స్ వున్నాయి. ఇవి సౌర శక్తిని ఒక బాటరీ లో నిక్షిప్తం చేస్తాయి. ఈ బాటరీ యొక్క సామర్ధ్యం 15kWh. ఇది ఆ దేశపు వాతావరణాన్ని అనుసరించి 621 మైళ్ళు తిరుగుతుంది. అదే మరింత ఎండ వుంటే మరింత ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఇది 78 mph వేగంతో దూసుకుపోతుంది. ఈ కారును కార్బన్ ఫైబర్ తో తయారు చేసారు. ఇంకా దీనికి మరెన్నో ప్రత్యేకతలు వున్నాయి. దీనిలోని నావిగేటర్ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ వెళ్ళాల్సిన దారిని చూపిస్తుంది. దీనిని మొబైలు కు కూడా అనుసంధానం చేసుకోవచ్చు. ఇటువంటి ప్రత్యేకతలతో ఇది ఆస్ట్రేలియా లోని “వరల్డ్ సోలార్ ఛాలెంజ్” లో పాల్గోనబోతోంది.
ఇటువంటి సోలార్ కార్లు తరిగిపోతున్న ఆయిల్ మరియు గ్యాస్ నిల్వల దృష్ట్యా ఇవి ఆశా కిరణం వంటిది. వీటిని కొద్ది మార్పులతో దేశ అవసారాలకు అనుగుణంగా మార్చగలిగితే ఇవి ఆటోమొబైల్ రంగంలో ఒక విప్లవానికి దారి తీస్తుంది.