మనకు ఆహారాన్ని గూర్చి ఒక నానుడి ప్రచారం లో ఉంది. అది – ఆహారం మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం. ఆహారం పట్ల శ్రద్ధ వహిస్తే చాలు, చాలా వరకు రోగాలను నియంత్రించవచ్చు. కాని అందరి అవసరాలు ఒకేలా ఉండవుగా. పిల్లలకూ, స్త్రీలకూ, పురుషులకూ, వృద్ధులకు ఇలా వారి వారి వయసు, బరువు, ఆరోగ్యాన్ని బట్టి ఆహార నియమాలు మారుతుంటాయి. అలాగే ఆరోగ్యం కోసం తినకూడని పదార్ధాలను సైతం తెలుసుకొని మానుకోవాలి. ఒక్కోసారి ఆరోగ్యంగానే ఉన్నామనుకొని ఏది పడితే అది తినేస్తుంటారు. ఇవన్ని అనారోగ్య హేతువులే.
పైగా ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యం పట్ల, ఆకృతి పట్ల అవగాహన పెరిగింది. అలాంటప్పుడు ప్రతీ నిత్యం మనకు ఏమేం తింటున్నామో, ఎంత తింటున్నామో ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా. అందుకోసమే అందుబాటులోకి రాబోతోంది AEGLE Palatte. దీనిని Harvard కు చెందిన Yulin Li మరియు వారి బృందం తయారు చేసారు. ఇది ఒక డిజిటల్ డైటీషియన్ అని చెప్పచ్చు. AEGLE అంటే గ్రీకు భాషలో ఆరోగ్య ప్రదాయిని అయిన ఒక దేవత పేరు. ఆరోగ్యం, ఆహారం వల్ల చేకూరుతుంది కాబట్టి Li ఈ పరికరానికి ఆ పేరు పెట్టారు. ఈ AEGLE Palatte ఇప్పటికే మనకు అందుబాటు లో ఉన్న డైట్ యాప్ ల అన్నిటికంటే మెరుగైనది, సమర్ధవంతమైనది కూడా. ఇక అసలు విషయం లోకి వెళ్తే…
ఇది చూడడానికి మన డైనింగ్ టేబుల్ మాట్ లా ఉంటుంది. ఇది మన ఫోనుకు బ్లూ టూత్ ద్వారా అనుసంధానం చెందిన యాప్ ద్వారా పని చేస్తుంది. ఈ మాట్ ను రీచార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ మాట్ మీద ఉంచబడిన పదార్ధాలను ఒక్క గ్రాము వరకూ గుర్తిస్తుంది అంటే దీని సామర్ధ్యం ఏంటో అర్ధం అవుతుంది. అలాగే దీని మీద ఉంచబడిన పదార్ధాల లోని కేలరిలను, పోషకాలను ఈ యాప్ లో చూడచ్చు. మీ భోజనానికి దీన్ని ఉపయోగించిన ప్రతీ సారి, ఇది మీ ఆహారపుటలవాట్లను గమనిస్తుంది. అలా కొద్ది నెలలు గమనించిన తరువాత ఈ పరికరానికి ప్రత్యేకమైన క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టంలో ఈ సమాచారాన్ని స్టోర్ చేసి, విశ్లేషించి మీ ఆరోగ్యానికి తగ్గ సూచనలు చేయడం దీని ప్రత్యేకత. అంతే కాదు మీకు తగిన రెస్టారెంట్లను కూడా ఇది చూపిస్తుంది. అంతే కాదు మీరు వంట చేసేటప్పుడు రోజు ఎన్ని కేలరీల భోజనం తయారు చేస్తున్నారో, ఒక్కో పదార్ధాన్ని ఇందులో వేసి బేరీజు వేసుకొని చూడవచ్చు. అలా ఇది ఒక personalised food diet ను సూచిస్తుందన్నమాట. ఈ పరికరం లో రెండు రకాలు లభ్యం అవుతున్నాయి అవి AEGLE Palette మరియు Palette Kitchen.
ఈ పరికరం సెప్టెంబర్ 2015 చివరికల్లా అందుబాటు లోకి రాబోతోంది. దీని ధర $80 నుంచి $129 వరకూ ఉండచ్చు. ఈ పరికరం ప్రజల ఆహారపుటలవాట్లలో మార్పు తీసుకొచ్చి వారికి ఆరోగ్యాన్ని చేకూర్చాలని ఆశిద్దాం.