కాన్సర్ అంటే ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఈ మహమ్మారికి యావద్ ప్రపంచమే గడగడ లాడుతుంది. ఎందుకంటే ఏటా కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా దీనికి బలవుతున్నారు. అంతే కాదు అసలు కొన్ని రకాల కాన్సర్ లకు ఇంకా వైద్యమే అందుబాటులో లేదు. అన్నిటికీ మించి దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే, వ్యాధి బాగా ముదిరిన తరువాత కానీ ఈ వ్యాధి ఉందని బయటపడదు. దాంతో ఏ కొద్ది మందో తప్ప ఎక్కువ మంది దీనికి వైద్యం చేయించినా దీనిని జయించలేరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. కేవలం ఒకే ఒక్క రక్త పరీక్ష ద్వారా కనీసం 10 ఏళ్ల ముందుగానే ఈ వ్యాధి సోకుతుందని నిర్ధారించవచ్చు. Swansea University వారు చేసిన పరిశోధన లోని ఆసక్తికర విశేషాలు ఇవిగో.
బ్రిటన్ లోని Swansea University కి చెందిన పరిశోధకులు కాన్సర్ ను కనిపెట్టేందుకు ఒక రక్త పరీక్షను రూపొందించారు. “ఇది ఎలాంటిదంటే కాన్సర్ ను నిర్ధారించడానికి ఇది ఒక స్మోక్ డిటెక్టర్ పరీక్ష వంటిదని” ఈ బృందానికి నాయత్వం వహించిన ప్రొ. Gareth Jenkins అన్నారు. ఎందుకంటే, స్మోక్ డిటెక్టర్ లో ఆ పరికరం నిప్పు కంటే పొగ ద్వారానే అక్కడ నిప్పు రాజుకుందని తేల్చినట్టు ఈ రక్త పరీక్ష కూడా అదే విధంగా రూపొందించబడిందని పేర్కొన్నారు. ఇక ఈ రక్త పరీక్షలో వీరు రక్తంలో mutated cells ను గూర్చి పరీక్షిస్తారు.
ముందుగా ఈ mutated cells అంటే ఏంటో చూద్దాం. మన శరీరం లో ప్రతీ అణువులోనూ మన DNA సీక్వెన్స్ ఉంటుంది. ఇది ప్రతీ వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. మన రక్తంలో ప్రతీ క్షణం ఎన్నో కణాలు పుడుతుంటాయి, నాశనం అవుతుంటాయి. ఈ క్రమoలో ఒక్కో కణం విభజన జరిగి మరో కణం ఉత్పత్తి అయ్యేటప్పుడు ఈ రెండవ దాంట్లోని DNA సీక్వెన్స్ లో మార్పు జరిగితే దీనినే mutated cells అంటారు.
ఇవి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రక్తంలో చాలా తక్కువ సంఖ్య లో ఉంటాయి (5 per million) అదే కాన్సర్ ఉన్న వ్యక్తి రక్తంలో (hundreds per million) ఎందుకంటే ఇవి ఉన్నాయి అంటే ఆ వ్యక్తికి కాన్సర్ మొదటి దశలో ఉన్నట్టు లేదా భవిష్యత్తులో కాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉన్నట్టే.
ఈ రక్త పరీక్షను ఇప్పటిదాకా ఈశోఫాగస్ (అన్నవాహిక) కాన్సర్ (Esophagus cancer) వారి మీదే పరీక్షించారు. దీనిని మరిన్ని కాన్సర్ల మీద పరీక్షించాల్సి ఉంది అని Jenkins అంటున్నారు. అటు పైన మాత్రమే ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ పరీక్ష కేవలం $46 కే లభ్యం కావడం విశేషం. ఎంతో ఖరీదైన వైద్యం, అలాగే ముదిరితే కానీ బయట పడని ఇటువంటి మొండి జబ్బులను ముందుగానే గుర్తించేందుకు చేసిన వీరి ప్రయత్నం అభినందనీయం.