ఇదంతా డిజిటల్ యుగం. కంప్యూటర్ నుండి ఫోన్ కు, ఫోన్ నుండి కంప్యూటర్ కు మనం చాలా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. ఇందులో కొన్ని వ్యక్తిగత అయినవి కావచ్చు మరి కొన్ని కార్యాలయానికి సంబంధించినవి అయి ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఎదో ఒక పని నిమిత్తం కార్డు లేదా ఐడెంటిటీ పేపర్లను స్కాన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం పడే ఇబ్బందుకు అన్నీ ఇన్నీ కావు. ఏదైనా ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా, లేదా కాలేజీ ఇంకా పిల్లల చదువు కోసం ఇలా ఎదో ఒక అవసరం మనకు నిత్యం ఎదురు పడుతూనే ఉంటుంది. ఆయా డాక్యుమెంట్లను స్కాన్ చేసి ప్రింట్ చేసేటప్పుడు మన కెమెరాలో ఫోటో తీసి దానిని ఒక యాప్ లో మరో ఫార్మట్ లోకి మార్చుకుని ప్రింట్ చేస్తుంటాం. ఇప్పుడు ఈ కష్టాలన్నిటికీ శలవు. మనకు సౌకర్యంగా ఎలాంటి పేపర్ నైనా స్కాన్ చేసి సులువుగా ప్రింట్ చేసుకోవడానికి Pup మొబైల్ స్కానర్ వచ్చేసింది.
ఈ Pup మొబైల్ స్కానర్ ను Next అనే అమెరికన్ సంస్థ 18 నెలలు శ్రమించి రూపొందించింది. ఇది పూర్తిగా వైర్లెస్, బ్లూటూత్/వైఫై స్కానర్. ఇది బాటరీ ద్వారా పని చేస్తుoది. ఇక దీనిని ఉపయోగించడం చాలా తేలిక. స్కాన్ చేయాల్సిన డాక్యుమెంట్ పై దీనిలోని లెన్స్ ను ఫోకస్ చేసి దీనిలో ఉండే ఒకే ఒక బటన్ వత్తితే చాలు మీరు ఫోకస్ చేసిన భాగం లేదా పూర్తి పేజీ స్కాన్ చేయబడి క్లౌడ్ లో సేవ్ అయిపోతుంది. ఈ Pup స్కానర్ కు ఇన్-బిల్ట్ LED లైట్ ఉంటుంది, అది ఫోకస్ చేయగానే ఫ్లాష్ లాగా పని చేసి డాక్యుమెంట్ ను మరే లైటింగ్ అవసరం లేకుండా స్పష్టంగా స్కాన్ చేస్తుంది. ఆ పైన మరోసారి ఈ బటన్ వత్తితే ఈ డాక్యుమెంట్ ను పింటేరస్ట్ మొదలైన సోషల్ మీడియా లో షేర్ కూడా చేసుకోవచ్చు. బ్లూటూత్ లేదా వై-ఫై ద్వారా కంప్యూటర్ కు చేరవేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు స్కాన్ చేసే ప్రతీదీ తిరిగి పెన్ డ్రైవ్ లో సేవ్ చేయాల్సిన పని తగ్గుతుంది. తిరిగి ఏ డాక్యుమెంట్ అయినా మీకు తేలిగ్గా అందుబాటులో ఉంటుంది. ఈ పరికరం (Pup పాకెట్ స్కానర్) చాలా తేలిగ్గా ఉండి పేరుకు తగ్గట్టే మీ పాకెట్ లేదా హ్యాండ్ బాగ్ లో పెట్టుకుని మీ కార్యాలయానికి లేదా మరెక్కడికైనా తీసుకువెళ్ళచ్చు.
అంతే కాదు ఇది ఉంటే ప్రింటర్ కు ప్రత్యామ్న్యాయంగా దీనినిన్ వాడుకోవచ్చు. ఎలాగంటే స్కాన్ చేసిన డాక్యుమెంట్లన్నీ ఈ Pup పాకెట్ స్కానర్ లో ఉంటుంది కాబట్టి ఏదైనా నెట్ సెంటర్ లేదా లైబ్రరీ లేదా కార్యాలయంలో ప్రింటర్ దగ్గర మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ పరికరం ధర $200.
నిత్యం ఎదో ఒక డాక్యుమెంట్ల తో పని ఉండే వారికి, విద్యార్ధులకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.