మనం రోజూ వారీ జీవితంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం సాంకేతికత పెరిగే కొద్దీ ఎక్కువై పోతోంది. ఒకప్పుడు టీవీ మహా అయితే డెస్క్టాపు కంప్యూటర్ వాడేవాళ్ళం కాస్తా ఫోన్లు, టీవీలు, లాప్టాప్, టాబ్లెట్ ఇలా పెరిగిపోతోంది లిస్టు. సరే అది అలా ఉంచితే ఒక్కో పరికరం కొన్ని వేలు పెట్టి కొనాలి. ఆపైన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ పరికరాల్లోని స్క్రీన్ ఒక ముఖ్యమైన భాగం. అది కానీ పొరపాటున పగిలితే కొన్ని వేలు పెట్టి మార్చాల్సి వస్తుంది. చాలా మందికి ఈ స్క్రీన్ కాపాడుకోవడమే కష్టం. ఇక స్క్రీన్ గార్డ్ లు కూడా పరిమితంగానే ఫలితాన్నిస్తాయి అని వేరే చెప్పకర్లేదు. కానీ ఇప్పుడు ఆ స్క్రీన్ గురించి బాధ లేదు. దీన్ని కాపాడుకోవడానికి అత్యంత సులభ మార్గంలో ఒక ఉత్పత్తి మార్కెట్లోకి రాబోతోంది. అదే ఈ ProtectPax.
జర్మన్ సంస్థ ProtectPax, ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్లోని స్క్రీన్ లను కాపాడటానికి ఒక ద్రవాన్ని తయారు చేసింది. ఈ ద్రవాన్ని కొద్దిగా ఫోన్ స్క్రీన్ మీద వేస్తే చాలు మీ ఫోను మీద గీతలు పడకుండా, స్క్రీన్ పగలకుండా ఉంటుంది. ఆ ద్రవం ఫోనును ఎంత గట్టిగా చేస్తుంది అంటే దాని మీద సుత్తితో కొట్టినా పగలనంత పటిష్టంగా చేస్తుంది. ఇంతకీ ఏంటి ఆ ద్రవం అనుకుంటున్నారా. దీనిలో టైటానియం డైఆక్సైడ్ (Titanium dioxide nano particles) నానో పార్టికల్స్ కలిగి ఉండడం చేత ఇది ఫోను కింద పడినా కూడా స్క్రీన్ పగలకుండా కాపాడుతుంది.
అసలు ఈ టైటానియం డైఆక్సైడ్ (Titanium dioxide nano particles) నానో పార్టికల్స్ ను విమానయాన రంగంలో ఉపయోగిస్తారు. ఇక ఇది ఎలా పని చేస్తుంది అంటే, ఈ నానో పార్టికల్స్, స్క్రీన్ మీద ఉండే మైక్రోస్కోపిక్ వెల్స్ ను పూడ్చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. దీనిని ఎలా ఉపయోగించాలి అంటే, ముందుగా ఫోను స్క్రీన్ ను ఏదైనా కొంచెం తడి గుడ్డతో శుభ్రంగా తుడిచిన తరువాత ఈ ద్రవాన్ని కొద్దిగా స్క్రీన్ మీద వేసి ఒక చిన్న గుడ్డ తో స్క్రీన్ మొత్తం పరిచినట్టుగా తుడవాలి. ఇది ఆరడానికి పది నిముషాలు పడుతుంది, అంతే. ఫోను కింద పడినా పగలదు. ఫోను మీద గీతలు కూడా పడవు. ఇక మీ స్క్రీన్ కు శ్రీ రామ రక్ష.
అన్నిటికంటే ముఖ్యంగా ఇది కేవలం ఫోన్లకే కాదు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల స్క్రీన్ లకు ఉపయోగపడటం విశేషం. ఇది ఏడాది పాటు మాత్రమే పని చేస్తుంది. దీని ధర $17. ఇది త్వరలోనే మార్కెట్ లోకి రాబోతోంది.