ఈ రోజుల్లో చిన్నా పెద్దా అందరికీ ఉద్యోగాలు తప్పనిసరి అయ్యాయి. తమ తమ కెరీర్ పట్ల అందరికీ శ్రద్ధ పెరిగింది. ఈ దశలో తల్లి తండ్రులు అయినా, భార్యా భర్తలైనా ఇంట్లోని తమ సంతానమైన వేరే ఊళ్ళో లేదా వేరే దేశంలో ఉండటం అనివార్యమవుతోంది. ఇక వాళ్ళ మధ్య దూరాన్ని తగ్గించేందుకు మెసెంజర్ లో వీడియో కాల్స్ మామూలు అయిపోయాయి. ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు తమ ఆత్మీయులు విదేశాల్లోనో మరెక్కడో ఉంటే ఇలా మాట్లాడుకోవడం సాధారణం అయిపొయింది. వీటితో కొంత తృప్తి పడినా మరింత మెరుగైన సాంకేతిక పరిజ్ఞ్యానం తో ఆత్మీయులను దగ్గర చేసేందుకు వారి స్పర్శను మీకందించేందుకు ప్రయత్నిస్తున్నారు పరిశోధకులు.
కెనడా లోని Simon Fraser University lab కు చెందిన School of Interactive Arts and Technology ప్రొ. Carman Neustaedter, ఇలా వేరు వేరు చోట్ల ఉన్న ఆత్మీయుల స్పర్శను మనకు అందించేందుకు ఒక ప్రత్యేకమైన గ్లోవ్స్ తయారు చేసారు. అవే ఈ Flex-n-Feel గ్లోవ్స్. ఇవి చేతికి తొడుక్కుని అవతలి వారితో వీడియో కాల్ లో చూస్తూ మాట్లాడటమే కాదు వారిని ముట్టుకున్న అనుభూతి కూడా కలుగుతుంది. ఇందులో రెండు గ్లోవ్స్ ఉంటాయి. ఒకటి Flex గ్లోవ్, రెండవది Feel గ్లోవ్. వీటిని ఇద్దరూ తోడుక్కోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే స్పర్శ సాధ్యమవుతుంది. ఈ Flex గ్లోవ్ లో actuator లను వేళ్ళ పై భాగంలో అమర్చారు.
దీనిని తోడుకున్న వ్యక్తి వేళ్ళను కదిపినప్పుడు ఆ కదలికలు Feel గ్లోవ్ తోడుకున్న వ్యక్తి గ్లోవ్ లో అరచేతి వైపు సెన్సర్ ల ద్వారా అవతలి వ్యక్తి స్పర్శను పొందగలరు. ఇవి ఎలా పని చేస్తాయి అంటే ఈ రెండు గ్లోవ్స్ వైఫై ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఈ Flex గ్లోవ్ వేసుకున్న వ్యక్తి గ్లోవ్ పై భాగంలో ఒక స్విచ్ ఉంటుంది. దీనిని నొక్కితే ఒక LED లైట్ వెలుగుతుంది. ఇదే ఒక సంకేతంగా అవతలి గ్లోవ్ కు అందుతుంది. అవతలి వారు గ్లోవ్ లోని స్విచ్ నొక్కగానే ఇద్దరూ గ్లోవ్ ద్వారా కనెక్ట్ అవుతారు. ఇక ఈ రెండు గ్లోవ్లలో సెన్సర్లు, మైక్రో కంట్రోలర్ ఉంటాయి. ఇవి ఒక్కో కదలికను భిన్నంగా గుర్తించి ఈ సమాచారాన్ని మరో గ్లోవ్ కు పంపుతుంది. సరిగ్గా మరో గ్లోవ్ లో ఆ సమాచారం, అరచేతి భాగంలో సెన్సర్లు ద్వారా స్పర్శ అనుభూతిని సాధ్యం చేస్తుంది. ఈ విధంగా మనం అవతలి వారిని ముట్టుకోవడం సాధ్యపడుతుంది. దీన్లోనే మరో రకం గ్లోవ్స్ తో ఇద్దరి స్పర్శ ఒకేసారి మరొకరికి అందేలా రూపొందిస్తున్నారు. అంటే ఆ స్పర్శ, ఆ స్పర్శకు ప్రతి స్పందన ఎలాంటి జాప్యం లేకుండా అందుతుంది అన్న మాట. ఇంతేనా దూరంగా ఉండే వారిని దగ్గర చేయడం కోసం వర్చ్యువల్ రియాలిటీ ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఇవన్నీ తోలి దశలో ఉన్నాయని ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుంది అని Neustaedter అంటున్నారు. సరే, ఏది ఏమైనా ఇవి త్వరలోనే అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.