అద్దం. మనందరికీ ఎంతో ప్రియమైన వస్తువు. పిల్లలూ, పెద్దలూ దీని ముందు నిలబడి తమని తాము చూసుకొని మురిసిపోతుంటారు. ఇక ఆడవారికైతే అద్దానికీ, వారికీ విడదీయరాని అనుబంధం ఉంది. ఇప్పటి వరకూ ఇది కేవలం ఒక అలంకార వస్తువులానే మిగిలిపోయింది. పై పై మెరుగులు తప్ప దీనిలో ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ మార్పు ఏమి లేదు. కాని ఇప్పుడు రాబోతోంది. మనం ఊహించని విధంగా ఈ అద్దం తనని తానూ మార్చుకొని మన ముందుకు రానుంది. అదెలాగో చూద్దాం.
యూరోప్ లో కొన్ని దేశాల్లోని శాస్త్రవేత్తలు ఈ సాధారణ అద్దాన్ని Wize mirror గా మార్చనున్నారు. ఇందులో కెమెరా, స్కానర్, గ్యాస్ సెన్సర్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇందులోని కెమెరా మన ముఖం లో ప్రతీ రోజు జరిగే మార్పులను గమనిస్తుంది. అలా ముఖంలో స్ట్రెస్, anxiety వంటి లక్షణాలను గుర్తిస్తుంది.ఇది మన చర్మం రంగులోని మార్పుని బట్టి మన గుండె ఎలా కొట్టుకుంటోoదో కూడా చెప్పేస్తుంది. ఈ కెమెరా వృద్ధాప్యపు ఛాయల్ని కూడా గుర్తిస్తుంది. ఇంకా దీనిలోని 3D facial scanner మనిషి బరువు పెరిగినా, తగ్గినా కూడా గమనిస్తుంది. ఇక దీనిలోని గ్యాస్ సెన్సర్స్ వ్యక్తి ఊపిరి లోని రసాయనాలను బట్టి వారి ధూమపానం (smoking) మరియు మద్యపానం (drinking) అలవాట్లను గుర్తించి వారికి కాన్సర్ వంటి ముప్పు పొంచి ఉన్నప్పుడు ముందుగానే సూచన చేస్తుంది. ఇదంతా టచ్ స్క్రీన్ లా తయారు చేస్తున్న ఈ అద్దం లోనే తెలుస్తాయి. ముఖ్యంగా ఈ అద్దంతో గుండె జబ్బులు ఇంకా ఎన్నో ప్రమాదకర వ్యాధులను ఆది లోనే గుర్తించే అవకాశం ఉంది అంటున్నారు దీనిని తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.
అయితే ఇది ఇంకా తోలి దశలోనే ఉంది. దీని నమూనాను ప్రస్తుతం తయారు చేసే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. ఇది కొద్ది సంవత్సరాల్లోనే మన ముందుకు వస్తుంది. అద్దం వంటి నిత్యం ఉపయోగించే వస్తువులో మన ఆరోగ్యాన్ని గమనిచగలగడం అద్భుతం.