ఈ దశాబ్ద కాలంగా రవాణా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ సంస్థలు వినియోగదారులకు ఒక కొత్త అనుభూతిని ఒక కొత్త రకం సాధనంతో ఇవ్వడం తో పాటు, వారిని గమ్య స్థానానికి వేగంగా ఎలా తీసుకువెళ్ళాలా అనే దాని పైన దృష్టి పెట్టాయి. ఇందుకు గతంలో మనం చెప్పుకున్న ‘Pop Up’ వంటివి ఉదాహరణలు.
సరే, ఇప్పుడు వినియోగదారులకు నీటి పైన ఎగిరే విధంగా ఒక చిన్న సైజు విమానాన్ని తలపించే ఒక కార్ ను తయారు చేసింది అమెరికా లోని Kitty Hawk సంస్థ. ఈ సంస్థలో గూగుల్ సంస్థాపకుడు Larry Page కు భాగస్వామ్యం ఉంది. ఇది పూర్తిగా విద్యుత్ శక్తి తో ఎగురుతుంది. అలాగే ఇది మన కార్ గారేజ్ లో కూడా సరి పోయేలా దీనిని తయారు చేసారు. ఈ Kitty Hawk నమూనా గత నెల నుండే పరీక్షిస్తున్నారు. ఈ వాహనం ఎలా ఎగురుతుందో ఈ వీడియో లో చూడచ్చు. అయితే ఇది వినియోగదారులకు అందుబాటులోకి రావాలంటే ఈ సంవత్సరాంతం వరకు ఆగాల్సిందే. $100 కు దీనిని మూడు సంవత్సరాల పాటు నడిపేందుకు ఈ క్లబ్ లో మెంబెర్షిప్ ఇస్తారు. అంతే కాక ముందుగా $2000 చెల్లిస్తే, ఈ వాహనం మార్కెట్ లోకి వచ్చిన తరువాత ఈ $2000 మినహాయించి మిగతా మొత్తం చెల్లించి వాహనం సొంతం చేసుకోవచ్చు.
ఈ వాహనం మన సంప్రదాయ వాహనాలకు పోటీగా కాకుండా చిన్న పాటి సరస్సులు, నదుల పై ఒక గంట పాటు షికారు చేసేందుకు తయారు చేయబడింది. దీనిని నడపాలంటే పైలట్ లైసెన్సు ఏమీ అవసరం లేదు, ఎవ్వరైనా తేలిగ్గా నడిపేలా దీనిని తయారు చేసారు. ఇంచుమించి ఇలాగే రోడ్ మీద అలాగే గాలిలోనూ ఎగిరే కార్ ను తయారు చేస్తోంది యురోపియన్ సంస్థ AeroMobil. ఈ సంస్థ వాహనం తో ఒక గంటపాటు విమానం అవసరం లేకుండా ఒక చోటు నుండి, ఏదైనా సరస్సు లేదా నది దాటి మరో చోటుకు వెళ్లేందుకు AeroMobil సంస్థ వాహనం తయారు చేయబడింది. ఇలా ఒకటేమిటి మరి కొన్ని సంస్థలు కూడా ఒకే వాహనం తో బహుళ ప్రయోజనాలు పొందేలా వాహనాలను తయారు చేస్తున్నాయి.
సరే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న Kitty Hawk ఈ నమూనా కంటే కాస్త భిన్నంగా ఉంటుంది అని సంస్థ చెబుతోంది. దీనిని బట్టి భవిష్యత్తులో రవాణా వ్యవస్థలో ఇంకెన్ని పెను మార్పులు వస్తాయో మరి.