ప్రస్తుత కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రాణాంతక జబ్బు కాన్సర్. దీంట్లో చాలా రకాలే ఉన్నాయి. సుమారుగా వైద్యులు 100 రకాల కాన్సర్లను గుర్తించారు. అయితే ఈ జబ్బు ప్రత్యేకత ఏంటంటే మనిషి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా, ఈ కాన్సర్ లోపల మనిషి తినేయచ్చు. అది ఎప్పుడో కానీ బయటపడదు. జబ్బు ముదిరినప్పుడు వైద్యులు కూడా చేసేదేమీ ఉండదు. అందువల్ల ఈ జబ్బును ముందుగానే కనిపెట్టాలి అంటే కొన్నేళ్ళ ముందు నుంచే క్రమంగా పరీక్షలు చేయించుకోవాలి. అంటే సుమారు 40ల వయసు నుండే పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. అది కూడా చాలా ఖరీదైనవి, నొప్పితో కూడినవి ఉంటాయి. కనీసం పరీక్షలు చేయించుకోవాలన్నా ఇంత ఇబ్బంది ఎదుర్కోవాలి.

అందువల్ల ఇప్పటికే ఎన్నో దేశాల్లో ఏ రకం కాన్సర్ ను అయినా చాలా సులువైన పద్ధతిలో కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా జపాన్ లోని National Cancer Center Japan కు చెందిన పరిశోధకులు కేవలం ఒకే ఒక్క రక్తపు బొట్టుతో 13 రకాల కాన్సర్లను కనిపెట్టవచ్చని కనుగొన్నారు. అదెలాగో చూద్దాం.

microRNA అనే మలిక్యుల్ మనిషిలోని జన్యువులని నియంత్రిస్తూ ఉంటుంది. ఈ miRNA లోని తేడాలను బట్టి కాన్సర్ ను గుర్తించారు. రక్తంలోని ఈ miRNA ఆరోగ్యకరమైన కణాలు ఉంటే అలాగే ఉంటుంది. అదే రక్తంలో కాన్సర్ కణాలు ఉంటే ఈ miRNA విచ్చిన్నం అయిపోతాయి. అలా ఊపిరి తిత్తులు, కడుపు, స్వరపేటిక, జీర్ణకోశ, పాన్కిర్యాస్, బ్రేస్ట్ కాన్సర్లు కనిపెట్టవచ్చు అంటున్నారు Yet Takahiro Ochiya, NCC Research Institute. సరే ఇది ఎంత వరకు సమర్ధవంతంగా పని చేస్తుంది అంటే, అందుకోసం సుమారు 40,000 మంది (కాన్సర్ పేషెంట్ల) నుండి సేకరించిన రక్త నమూనాల మీద ఈ పరీక్ష చేయగా అది 95% పేషెంట్లకు ముందుగానే మొదటి స్టేజి కాన్సర్ ను కనిపెట్టింది. అలాగే 97% విజయవంతంగా బ్రేస్ట్ కాన్సర్ ను కనిపెట్టింది.

అయితే ప్రస్తుతం ఈ బృందం క్లినికల్ ట్రయల్స్ అంటే పేషెంట్ల మీద నేరుగా ఈ పరీక్ష చేయడానికి ప్రభుత్వానికి విజ్ఞ్యప్తి సమర్పించింది.

ఇలా సమర్ధవంతంగా ఇంత ప్రాణాంతక జబ్బును కనిపెట్టగలిగితే ప్రజలకు ఎంతో మేలు జరిగినట్టే. ఇప్పుడు కాకపోయినా మరో పదేళ్ళలో అయినా సరే కాన్సర్ ను గుర్తించేందుకు ఇటువంటి రక్త పరీక్షలు అందుబాటులోకి రావచ్చు.

Courtesy