ఏసి గదులు, ట్రైన్లు, వోల్వో బస్సుల గురించి విన్నాం కానీ ఈ ఏసి బట్టలు ఎంటా అనుకుంటున్నారా, దాని గురించి తెలుసుకోవడానికి మనం జపాన్ వెళ్ళాల్సిందే.
జపాన్. ఒక అభివృద్ధి చెందిన దేశం. అంతకు మించి ఒక పోరాట స్ఫూర్తి కలిగిన దేశం. ఎందుకంటే జపాన్ నిరంతరం ఎన్నో ప్రకృతి వైపరిత్యాలు అయిన భూకంపాలు, సునామి మొదలైన వాటితో సతమతమవుతూనే వుంటారు. ఇక ఈ మధ్యనే జరిగిన ఫుకుషిమా న్యూక్లియర్ ప్రమాదం వలన ఆ దేశం విద్యుత్ వినియోగం పై ఆంక్షలు విధించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యుత్ ఆంక్షల నేపధ్యంలో జపాన్లోని ఒక బట్టల కంపెనీ ఏసి బట్టలను తయారు చేసింది. అవేంటో చూద్దాం రండి.
ఒక చొక్కా వెనుక భాగంలో 2 ఫ్యాన్ లను అమర్చింది. ఈ ఫ్యాన్లు ఒక చిన్న రీచార్జ్ బాటరీ ద్వారా పని చేస్తుంది. ఈ ఫ్యాన్లు లోపలి కి గాలిని ప్రసరింప చేయటం వల్ల చెమటను పీల్చుకొని చల్లదనాన్ని ఇస్తుంది. ఈ ఫ్యాన్లు సాధారణ ఏసి తో పోలిస్తే దానిలో 50వ వంతు విద్యుత్ ను మాత్రమే వినియోగిస్తుంది. ఈ ఫ్యాన్లు Lithium-Ion బాటరీ తో పని చేయడం వల్ల ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఏకంగా 11 గంటలు పని చేస్తాయి. దీని యొక్క ధర కేవలం $140 మాత్రమే.
జపాన్ ప్రజలు ఇప్పటికే ఈ చొక్కాల కోసం ఎగబడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం వీటిని ధరించడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఇవి ధరిస్తే తాము లావుగా కనిపిస్తున్నామన్నది వారి వాదన. అయితే ఈ పరిమితిని కూడా దాటుకొని ఎవరయినా మరిన్ని బట్టలు రూపొందిస్తారేమో వేచి చూడాల్సిందే!!