ఒక జబ్బును లేదా వ్యాధి ని కనిపెట్టడానికి దానికి సంబంధించిన సూచనలను వైద్య పరీక్షల ద్వారా కనుగొంటారు. అలా ఒకప్పుడు ల్యాబ్ లలో చేసే వైద్య పరీక్షలు ఇప్పుడు ఎవరికీ వారి ఇంటి దగ్గరే చేసుకునే విధంగా వచ్చేసాయి. అలా ఇంటి దగ్గర సులభంగా చేసుకునేవే టెస్ట్ స్ట్రిప్స్. ఈ టెస్ట్ స్ట్రిప్స్ రక్తం లేదా మూత్రం ద్వారా ఫలానా రోగ నిర్ధారణ చేస్తాయి. ప్రస్తుతం మనకు టెస్ట్ స్ట్రిప్స్ అంటే గుర్తొచ్చేవి ప్రేగ్నన్సీ టెస్ట్ స్ట్రిప్స్. ఆ పైన మధుమేహం వ్యాధి వచ్చిందో లేదో కూడా గ్లూకోమీటర్ స్ట్రిప్స్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఇక కాన్సర్ గురించి జరుగుతున్న విస్తృత పరిశోధనల కారణంగా ఈ వ్యాధి నిర్ధారణ చాలా సులభంతరం అయిపోతోంది.
ఒకప్పుడు చాలా ఖరీదైన పరీక్షల ద్వారా కానీ బయట పడని ఈ కాన్సర్ ఇప్పుడు కేవలం ఒక రక్త పరీక్ష ద్వారా కనుగొంటున్నారు అని మనం ఇది వరకు ఇదే వేదిక మీద చెప్పుకున్నాం. ఇప్పుడు అంతకు మించి సులభంగా టెస్ట్ స్ట్రిప్ల ద్వారా కాన్సర్ ను నిర్ధారణ చేయవచ్చు అంటున్నారు Michigan Tehcnological University కి చెందిన కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ Xiaohu Xia.
ఈ టెస్ట్ స్ట్రిప్లు రక్తపు బొట్టు ద్వారా కాన్సర్ను కనిపెట్టడం అంత తేలికేమీ కాదు. కారణం స్ట్రిప్ మీద వేసే శాంపిల్ చాలా తక్కువ ఉండడం ఒక సవాలు అయితే, రక్తం లేదా మూత్రంలో పీకోగ్రాములలో ఉండే కాన్సర్ బయో మార్కర్లను కనిపెట్టి తద్వారా జరిగిన రసాయన మార్పును కంటికి కనిపించేలా (Sensitivity) రూపొందించడం అతి పెద్ద సవాలు.
ఈ స్ట్రిప్ టెస్ట్ లో ఎక్కువగా గోల్డ్ నానోపార్టికల్స్ ను ఉపయోగిస్తారు. Xia పరిశోధనలో ఈ గోల్డ్ నానో పార్టికల్స్ ను కేవలం కొన్ని అణువుల మందంగా ప్లాటినం తాపడం చేస్తే, ఈ టెస్ట్ యొక్క సామర్ధ్యం (Senstitivity) మరింత పెరుగుతుందని కనుగొన్నారు. అంటే కంటికి స్పష్టంగా స్ట్రిప్ మీద జరిగే మార్పు కనిపిస్తుందన్న మాట.
ఇందుకోసం Xia ఒక ప్రయోగం చేసారు, ప్రోస్టేట్ కాన్సర్ ను కనుగొనేందుకు సాధారణ గోల్డ్ నానో పార్టికల్స్ స్ట్రిప్ మరియు ప్లాటినం కోటెడ్ గోల్డ్ నానో పార్టికల్స్ స్ట్రిప్ పని తీరును గమనించారు. మొదటి స్ట్రిప్ మీద కంటే రెండవ స్ట్రిప్ మీద ఎక్కువ magnitude ఉండడం గమనించగలరు.
ప్రస్తుతం Xia ఈ స్ట్రిప్ ను ప్రోస్టేట్ కాన్సర్ తో పాటు మరిన్ని కాన్సర్ లను కనిపెట్టడానికి పరిశోధన చేస్తున్నారు. Xia పరిశోధన ప్రాముఖ్యత ఏంటంటే, ఈ కాన్సర్ టెస్ట్ స్ట్రిప్ యొక్క సెన్సిటివిటీ ని పెంచడానికి చేసిన ఈ ప్లాటినం కోటింగ్ ఎక్కువ ఖరీదు కాకపోవడం. అందువల్ల మొత్తంగా ఈ టెస్ట్ స్ట్రిప్ ఖరీదు కాకుండా తక్కువ ధరకే ప్రజలకు లభించే అవకాశం ఉంటుంది.
ఈ టెస్ట్ స్ట్రిప్ వచ్చే నాలుగైదు ఏళ్ళల్లో ప్రేగ్నేన్సి టెస్ట్ స్ట్రిప్ మాదిరి ఈ కాన్సర్ నిర్ధారణ కొరకు టెస్ట్ స్ట్రిప్ లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Xiaohu Xia చేసిన ఈ పరిశోధన Nano Letters జర్నల్ లో ప్రచురించబడింది.