మహిళలకు మాత్రమే వచ్చే ఒకానొక బాధాకరమైన జబ్బు బ్రెస్ట్ కాన్సర్. అంతకంటే బాధాకరమైన అంశం ఏంటంటే, అసలు ఇలాంటి ఒక జబ్బు ఉందని, అందుకు తగ్గ వైద్య పరీక్షలు ఒక వయసు దాటాక మహిళలు చేయించుకోవాలి అని కూడా మన దేశంలో 50 శాతం పైనే ఎవరికీ తెలియదు. ఇక కాస్తో కూస్తో దీని పట్ల అవగాహన ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి పెద్ద పట్టణాల్లో తప్ప చిన్న చిన్న ఊళ్ళల్లో అసలు అవకాశమే లేదు. వెరసి ఈ జబ్బు సంక్రమించి చేయి దాటిపోయే పరిస్థితి వచ్చే వరకు మహిళలకు తెలియడం లేదు.
ప్రతీ మహిళ 40 ఏళ్ళు దాటాక ఏడాదికి ఒకసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. ఇది వైద్యుల దృష్ట్యా తప్పనిసరి. అయితే ఇది చేయించుకోవడం కొంచెం నొప్పితో కూడుకున్నది కావడం వల్ల కూడా చాలా మంది మహిళలు వెనుకంజ వేస్తారు. ఈ సమస్యలను అధిగమించి మహిళల్లో బ్రెస్ట్ కాన్సర్ ను గుర్తించడానికి ఒక చిన్న పరికరం అందుబాటులోకి వచ్చేసింది. అదే ఈ iBreastExam.

దీనిని Drexel university కి చెందిన వైద్యులు డా. Mihir Shah స్థాపించిన UE Lifesciences Inc. అనే సంస్థ దీనిని రూపొందించింది. ఈయన దీనిని తయారు చేయడానికి సుమారు ఒక దశాబ్ద కాలం పాటు ఆయన శ్రమించారు. మొదటగా Shah ఒక ‘నో టచ్ బ్రెస్ట్ ఎక్సమ్ ను తయారు చేసారు. ఇది చాలా పెద్దదిగా ఉంటుంది. అయితే మహిళల్లో బ్రెస్ట్ కాన్సర్ ను గుర్తించడానికి మన చేతిలో పట్టే పరికరం తయారు చేయడం ఆయన ఉద్దేశ్యం. దీని కోసం ఆయన 2011 నుండి ప్రయత్నిస్తున్నారు. అలా ఈ iBreastExam తయారైంది. దీనిలో ఉండే ceramic sensor బ్రెస్ట్ టిష్యూ లోని తేడాలను గుర్తించి ఏమైనా ట్యూమర్లు ఉంటే కనిపెట్టేస్తుంది. ఈ iBE ను క్లినికల్ ట్రైల్స్ కోసం 989 మంది ఆరోగ్యంగా ఉన్న మహిళల మీద, 20 మంది బ్రెస్ట్ కాన్సర్ పేషెంట్ల మీద ప్రయోగించారు. అంతే కాదు ఈ ప్రయోగం మూడు విధాలుగా చేసారు – iBE, ఒక నిష్ణాతుడైన వైద్యుడి ద్వారా పరీక్ష, మామోగ్రఫీ. ఇలా మరో రెండు పద్ధతుల్లో దీనిని పోల్చి చూస్తే, ఇది ఒక అనుభవం కలిగిన వైద్యుని కంటే 19 శాతం మేర ఎక్కువ సామర్ధ్యం తో ట్యూమర్లను ఇతర సమస్యలను గుర్తించింది.

ఈ iBreastExam యొక్క ఈ ప్రయోగం దానికి సంబంధించిన వివరాలను Indian Journal of Gynecologic Oncology, June సంచికలో ప్రచురించారు. ఇక ఇది వైర్లెస్ స్కానర్ కావడం, రేడియేషన్ ఫ్రీ చెక్ అప్ అవ్వడం మరో ప్రత్యేకత. దీనిని వైద్యులు, లేదా శిక్షణా సిబ్బంది ఉపయోగించవచ్చు. దీనితో చెక్ అప్ కేవలం అయిదు నిముషాల్లో ఎలాంటి నొప్పి లేకుండా పూర్తి అవ్వడంతో పాటు ఫలితాలు కూడా స్మార్ట్ ఫోన్ కు చేరుతాయి.

ఇంతటి సామర్ధ్యం కలిగింది కాబట్టే ఈ UE Lifesciences వారి iBreastExam 2016 Hitlab Innovators Summit అవార్డు గెలుచుకుంది. ఈ iBE ని త్వరలోనే మన దేశంలో అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Courtesy