హెచ్డీఎఫ్సీ బ్యాంకు(HDFC Bank) నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గ్రామీణ ప్రాంతాలల్లో బ్యాంకు నెట్వర్క్ ను మరింత విస్తరణ చేస్తామని ప్రకటించింది. దీని కోసం కొత్తగా నియామకాలు(recruitment) చేపడుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 2500 మంది ఉద్యోగులను రాబోయే ఆరు నెలల్లో నియమించుకోనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా వచ్చే 18 నుంచి 24 నెలల్లో తమ శాఖల నెట్‌వర్క్‌ను రెండు లక్షలకు పెంపోందించాలని అనుకుంటోంది. తద్వారా దేశంలోని మూడో వంతు గ్రామాలకు రాబోయే రెండేళ్లలో హెచ్‌డీఎఫ్‌సీని విస్తరించనున్నట్లు ప్రకటించింది. కొత్తగా ఏర్పడే శాఖలో 2,500 బిజినెస్ కరస్పాండెంట్లు, బిజినెస్ ఫెసిలిటేటర్లు, డిజిటల్ అవుట్ రీచ్ కన్సల్టెంట్లను నియమించుకుంటామని తెలిపింది .
ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్(HDFC Bank) 550కి పైగా జిల్లాల్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (Industry)కు రుణాలు అందిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని చిన్న తరహా సంస్థలకు రుణాలు అందిస్తామని తెలిపింది. మరో పక్క, హెచ్డీఎఫ్సీ ప్రస్తుతం లక్షకు పైగా భారతీయ గ్రామాల్లో బ్యాంకింగ్(Banking) వ్యవహారాలు నిర్వహిస్తోంది. రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రణాళికలు చేస్తోంది.
బ్యాంకింగ్ సేవల విస్తరణపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంకింగ్ గ్రూప్ హెచ్ రాహుల్ శుక్లా మాట్లాడుతూ ‘‘భారత ప్రభుత్వం(Indian Government ) అనేక పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మార్పును తెస్తోంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో బాధ్యతాయుతమైన నాయకుడిగా, సమాజంలోని అన్ని వర్గాలకు అత్యుత్తమ బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలు అందించాలనేదే మా కల. ప్రస్తుతం భారత గ్రామీణ, సెమీ అర్బన్ మార్కెట్లకు రుణ పరపతి తక్కువగా ఉంది. అర్బన్ ప్రాంతాల్లోనే బ్యాంకింగ్ సేవలు(Banking services), లోన్ల మంజూరు వంటివి ఎక్కువగా ఉన్నాయి. అందుకే గ్రామీణ మార్కెట్‌పై దృష్టి పెట్టాం’’ అని చెప్పారు.
గ్రామాల్లో సూక్ష్మ, మధ్యతరహా ఇండస్ట్రీ లకి చేయూతనిచ్చేందుకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వనున్నట్లు హెచ్డీఎఫ్సీ(HDFC) ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో కోతకు ముందు, కోతల తరువాత పంట రుణాలు, ద్విచక్ర వాహనాల రుణాలు, ఆటో రుణాలు, బంగారంపై రుణాలను పెద్ద ఎత్తున మంజూరు చేయనున్నట్టు వెల్లడించింది. వేగంగా మారుతున్న గ్రామీణ పర్యావరణ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఉత్పత్తులు, సేవలను సంస్థ అందించడానికి ముందంజలో ఉంటుందని తెలిపింది.