ఆటిజం అంటే పిల్లల్లో కనిపించే ఒక రకమైన బుద్ధి మాంద్యం అనుకోవచ్చు. ఇది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. పసితనం లోనే పిల్లలు దీని బారిన పడతారు. దీని వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఇక ఈ వ్యాధికున్న మరొక లక్షణం ఏంటంటే ఈ వ్యాధి సోకితే పిల్లల్లో కనీసం స్పందించే లక్షణం కూడా ఉండదు. ఇది ఒక రకమైన శాపం అనే చెప్పాలి. అయితే అదృష్టవశాత్తు ఇది మన దేశంలో కంటే అమెరికా వంటి దేశాల్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. అమెరికా లో ప్రతీ 68 మంది పిల్లల్లో ఒకరికి ఈ వ్యాధి సోకుతుందని 2014 లో ఆ దేశపు CDCP (Center for Disease Control and Prevention) విడుదల చేసిన రిపోర్ట్ సూచిస్తోంది.
ఈ ప్రత్యేకమైన లోపం ఉన్నటువంటి పిల్లలకు వారి దైనందిన కార్యకలాపాలు చేసుకోవడానికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఎందుకంటే సాధారణ పిల్లలు పెద్ద వారిని అనుకరించి ఏ పనైనా సులువుగా చేస్తారు. కానీ పైన చెప్పుకున్న కారణాల దృష్ట్యా ఈ పిల్లలు కనీసం ఎదుటి వారిలోని హావభావాలను సైతం గుర్తించలేరు. ఇందుకోసం వైద్యులు, ఆ పిల్లల తల్లి దండ్రులు కలిసి ఈ పిల్లలకు తోటి వారిని గమనించడం, వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం వంటి కనీస అంశాలకు శిక్షణ ఇస్తారు. ఇక ఆ తరువాత అవతలి వారి హావభావాలను, అంటే కోపం, సంతోషం, బాధ వంటి విషయాలను చెప్పడానికి వీరి తల్లి దండ్రులు ఫ్లాష్ కార్డ్స్ ను చూపించి పదే పదే చెప్పడం ద్వారా మనుషులలో వివిధ భావావ్యక్తీకరణ గూర్చి వీరికి అర్ధం అవుతుంది. వీటిని గుర్తించి స్పందిచగలిగితే ఒక మెట్టు ఎక్కినట్టే.
అయితే ఈ పద్ధతిలో అనుభవం కలిగిన శిక్షకులు, తల్లి దండ్రులు తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ పద్ధతిలో ఉపయోగించే ఫ్లాష్ కార్డ్స్ నిత్య జీవితంలో అంత అక్కరకు రాదు. ఈ లోటును తీర్చడానికి Catalin Voss అనే ఒక Stanford విద్యార్ధి ఈ పిల్లలకు ఉపయుక్తంగా ఉండేలా గూగుల్ గ్లాస్ తో అవతలి వారి హావభావాలను వీరికి తెలియచేసేందుకు ఒక software (emotion recognition software) ను రూపొందించాడు. ఈ గూగుల్ గ్లాస్ కు అనుబంధంగా ఒక యాప్ ద్వారా ఈ software పని చేస్తుంది. ఈ software మనుషులలోని కళ్ళు, పెదాలు, నొసలు ముడివేయటం వంటి కదలికల ద్వారా హావభావాలను గుర్తిస్తుంది. ఇక ఈ గూగుల్ గ్లాస్ పెట్టుకోవడం వల్ల అవతలి వారు చెప్పేదీ, వారి ముఖ కవళికలు అన్నీ రికార్డు అయ్యి ఈ పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు పనికొస్తుంది.
ఈ గూగుల్ గ్లాస్ తో ఈ software ను ఉపయోగించడానికి 20 మంది పిల్లలు సుముఖంగా ఉన్నారనీ, దీన్ని వాడిన తరువాత ఈ పిల్లల్లో మార్పు వచ్చిందనీ వీరి శిక్షకులు చెబుతున్నారు. అంతే కాదు Voss, ఈ సంవత్సరం జనవరి నుంచీ ఈ software ను ఉపయోగిస్తున్న పిల్లలకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించి దీనిని మరింత సమర్ధవంతంగా తీర్చి దిద్దే ప్రయత్నంలో ఉన్నాడు.
Catalin Voss యొక్క ఈ software MIT (Massachussetts Institute of Technology) వారి 2016 Lemelson-MIT Student Prize ను గెలుచుకుంది. స్పందించే గుణముంటే చాలు ఏ సమస్యకైనా ఎవరైనా పరిష్కారం చూపించవచ్చని Voss రుజువు చేసాడు కదూ.