వినాయకుడు, విఘ్నేశ్వరుడు, ఘననాయకుడు, గజాననుడు, గణేశుడు, లంబోదరుడు ఇలా ఆ మహాగణపయ్యను ఎంతో ముద్దగా పిలుచుకుంటారు భక్తులు. హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవత గణములకు అధిపతి ఏ పని చేసిన అడ్డంకులు తొలిగించేవాడు, వినాయక చవితి భారతీయులు జరుపుకునే పండుగలలో ఒక ముఖ్యమైన పండుగ.
మట్టి విగ్రహాలను వాడ వాడాలో ప్రతిష్టించుకుని ఎంతో ఘనంగా జరుపుకునే వినాయక చవితి పార్వతి పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. ప్రతి సంవత్సరం భాద్ర మాసంలోని శుక్ల పక్షంలో చతుర్థి తిథి నాడు గణేశ చతుర్థి వస్తుంది.
ఈ సంవత్సరం గణేశ చతుర్థి 2022 ఆగస్టు 31 బుధవారం వచ్చింది. వినాయకుడికి బుధవారం ఇష్టమైన రోజు కావడం కూడా విశేషం. బుధవారం గణేశ పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. అటువంటి పరిస్థితిలో బుధవారం నాడు గణేష్ చతుర్థి రావడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం, అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే
ఏకదంత ముపాస్మహే!
అని ప్రతి పూజకు ముందు మహా గణపతిని ప్రార్ధించడం మన ఆనవాయితీ. ఏ కార్యం మొదలు పెట్టిన నిర్విఘ్నంగా నేరావేరాలని గణపతినే పూజిస్తాం. గణపతి పూజ విధానం మన దేశంలోనే కాక ఎన్నో దేశాల్లో వ్యాపించి వుంది. ఈ విఘ్నేశ్వరుని పూజ భక్తి జ్ఞానప్రదోకమైనది గణపతి స్వరూపమే అయన తత్వాన్ని బోధిస్తుంది. గణేశుని తల ఏనుగు తల జ్ఞానానికి, యోగానికి ప్రతిబింబం.
పెద్ద చెవులు ఎదుటివారు చెప్పే ప్రతి విషయాన్ని వినాలని వివరిస్తాయి. ఒక చేతిలోని పర్సు అంటే గొడ్డలి అజ్ఞానాన్ని ఖండించడానికి అని అర్ధం. మరో చేతిలోని పాశం విజ్ఞానాన్ని నివారించడానికి, నియంత్రించడానికి అని అర్ధం. విరిగిన దంతం త్యాగానికి చిహ్నం, తొండం తనవనాదం, ఓంకారం, నాగబంధం శక్తికి, యోగ శాస్త్రంలోని కుండలికి ప్రతీక. మానవ శరీరం మాయకు ,ప్రకృతికి ఉదాహరణ.
ఇక ఎలుక వాహనం అన్ని జీవ రాశుల పైన సమానమైన ప్రేమ ఉండాలనే భావనను మనకు తెలియజేస్తుంది.
గణేశుడి చరిత్ర
పురాణం గాధల ప్రకారం పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి ఆయన ఎల్లప్పుడూ తన కడుపులో ఉండిపోవాలని కోరుకుంటాడు. అందుకు శివుడు కూడా అంగీకరిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి శ్రీమహా విష్ణువు సహాయం కోరుతుంది. శ్రీమహా విష్ణువు, బ్రహ్మదేవుని సాయంతో నందిని తీసుకుని వాటితో గజాసరుడి ముందు ఆడిస్తారు.
ఇందుకు తన్మయత్వం పొందిన గజాసురుడు ఏం కావాలో కోరుకోమని చెబుతాడు. దీంతో శివుడిని తిరిగి ఇచ్చేయమని కోరగా.. తన దగ్గరికి వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి అని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుడిని తన పొట్ట చీల్చమని బయటకు వచ్చేలా చేశాడు. ఆ తర్వాత లోకమంతా ఆరాధించబడేలా చేయమని, తన చర్మాన్ని శివుని వస్త్రంగా ధరించమని కోరుకొని మరణిస్తాడు.
శివుడి రాక గురించి విన్న పార్వతీ దేవి సంతోషంతో భర్త రావడానికి ముందు అందంగా తయారయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఓ బాలుడి రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలా పెట్టి ఎవ్వరినీ రానివ్వద్దని స్నానానికి వెళ్తుంది.
ఆ సమయంలో పరమేశ్వరుడు వస్తాడు. బాలుడికి ఎంత చెప్పినా అడ్డు తప్పుకోకపోవడంతో.. తన శూలంతో ఆ బాలుడి తలను ఖండించాడు. అప్పుడే స్నానం ముగించుకుని వచ్చిన పార్వతీ దేవి ఈశ్వరుడిని చూసి సంతోషిస్తుంది. అయితే అప్పుడే బాలడి ప్రస్తావన రావడంతో.. ఆ బాలుడు మన బిడ్డ అని చెబుతుంది. తనను ఎలాగైనా బతికించమని కోరుతుంది. అప్పుడు శివుడు గజాసురుడి తలను ఆ బాలుడికి అతికించి బతికించాడు.
అలా గజ ముఖం ఉండటం వల్ల వినాయకుడు గజాననుడిగా పేరు ప్రఖ్యాతలు గడించాడు. తన వాహనంగా అనింద్యుడు అయిన మూషికాన్ని మార్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత దేవతలంతా కలిసి పరమేశ్వరుడి వద్దకు వెళ్లి తమకు ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఏ దేవుడిని ప్రార్థించాలని కోరతారు. అప్పుడు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి పోటీ పడతారు. అప్పుడు శివుడు ముల్లోకాల్లో పుణ్యనదులన్నింటిలో స్నానం చేసి తిరిగి ఎవరైతే మొదట వస్తారో వారికే ఈ పదవికి అర్హులని చెబుతారు.
అప్పుడు గజాననుడు తన బలాబలాలు తెలిసి, మీరు ఇలాంటి నిబంధన పెట్టడం సబబేనా? అని అడగ్గా.. తండ్రి గణేశుడికో మంత్రాన్ని చెప్పి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దాన్ని పఠించమని చెబుతాడు. అప్పుడు ఆ మంత్రాన్ని పఠిస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోయాడు. అయితే ఈ మంత్ర ప్రభావం వల్ల కుమారస్వామికి తాను వెళ్లిన చోటంతా ముందుగానే గణేశుడు స్నానం చేసి వెళ్తున్నట్టుగా కనిపించేవారు.
అప్పుడు తిరిగొచ్చిన కుమారస్వామి అన్నగారి మహిమ గురించి తెలియకుండా ఏదో వాగాను. నన్ను క్షమించి అన్నయ్యకే ఈ పదవిని అప్పగించండి అని చెప్తాడు. అలా భాద్రపద మాసాన శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు. గణేశ చతుర్థి నాడు ఇంట్లో గణేశుడిని ప్రతిష్టించి పూజావిధానాలతో పూజిస్తే భక్తులకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం.
ఈ పవిత్రమైన రోజున దేవతలు, మునులు అందరూ వివిధ రకాల కుడుములు, ఉండ్రాళ్లు, పండ్లు, పాలు, తేనే, పానకం వంటివన్నీ సమర్పించుకుని, ఆ దేవుని ఆశీర్వాదాలు పొందుతారు.
అందరికీ తెలుగు గీక్ .కం వారి తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ….