TB అంటే క్షయ వ్యాధి ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని బలి తీసుకుంటోంది. అలాగే ఏటా ప్రపంచవ్యాప్తంగా HIV తో సమానంగా కొన్ని కోట్ల మంది దీని వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని WHO వెల్లడించింది. ఇంత వైద్యం అభివృద్ధి చెందినా ఇంకా TB అదుపులోకి రాలేదా అంటే, దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. వ్యాధికారక బాక్టీరియా మందులకు లొంగకపోవడమే. దీనిని Drug resistant bacteria అంటారు. అంటే మనం వాడే మందులకు మించి బాక్టీరియా శక్తివంతమైనదని అర్ధం. ఇందువల్లనే TB ఇంకా ఒక మొండి వ్యాధి అయింది. అలాంటి ఈ వ్యాధి నిర్ధారణ దానికి సరైన మందు సూచించడం చికిత్సలో అత్యంత ప్రధానం. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా వైద్య బృందాలు సమిష్టిగా కృషి చేసి ఒక సాఫ్ట్వేర్ ను తయారు చేసారు. అదే Cryptic.

అసలు ముందుగా TB కి చికిత్స ఎలా ఉంటుందో చూద్దాం. ఏ రకమైన బాక్టీరియా వ్యాధికి కారణం అయింది తెలియాలంటే వ్యక్తి నుంచి శాంపిల్ ను తీసుకుని lab లో పరీక్షించి ఆ strain బాక్టీరియా కి మందు ఏమిటో తెలియాలి. దీనికే కొన్ని వారాలు సమయం పడుతుంది. ఆ పైన ఏ మందుకి రోగి స్పందిస్తున్నదో తెలియాలంటే దానికి మరి కొంత సమయం పడుతుంది. ఈ లోపు రోగికి సాధారణంగా లభించే మందే వేస్తుంటారు. అది పని చేస్తే పని చేస్తుంది లేదంటే దాని వల్ల ప్రయోజనం ఉండదు. ఈ జాప్యం వల్లనే ఎంతో మంది వ్యాధి నిర్ధారణ అయ్యి సరైన చికిత్స చేసేలోపే మరణిస్తారు. అందువల్ల University of Oxford ప్రపంచవ్యాప్తంగా TB ని అరికట్టేందుకు ఒక ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. అదే ఈ Cryptic. దీనికి అనుబంధంగా కొన్ని ప్రపంచ దేశాలు పని చేస్తున్నాయి. అవి Chinese Center for Disease Control and Prevention, బీజింగ్, The National Institute for Communicable Diseases, జోహాన్స్ బర్గ్ మరియు ముంబై లోని The Foundation for Medical Research కు చెందిన TB పర్యవేక్షణ బృందాలు రోగుల నుంచి samples సేకరించి బెంగుళూరు లోని ఒక lab కు బాక్టీరియా Genome తెలుసుకోవడం కొరకు పంపిస్తుంది. ఇక్కడి సమాచారం మొత్తం Oxford University లోని ఒక database కు చేరుతుంది. అలా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ఏ బాక్టీరియా కు ఏ మందు వాడాలో ఈ Cryptic చెప్పగలుగుతుంది. అది కూడా అంత సులభం కాదు, సేకరించిన సమాచారాన్ని బట్టి AI (Artificial Intelligence) మాదిరి ఈ సాఫ్ట్వేర్ తగిన మందులను సూచించడం జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ కూడా ఎంత ఎక్కువ సమాచారం ఉంటే అంత సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే కొత్త బాక్టీరియా గురించి తెలుసుకోగలిగితే, దానికి తగిన మందు సూచించడం సులభం అవుతుంది కనుక.

దీని ద్వారా క్రమంగా ఒక పరికరాన్ని తయారు చేసి రోగి శాంపిల్ ను అందులో పరీక్షించి దాని నుంచి వచ్చిన సమాచారాన్ని ఈ Cryptic ద్వారా ఏ మందు తగినదని తెలుసుకోగలిగితే తద్వారా నిముషాల్లో TB నిర్ధారణ అలాగే చికిత్స జరిగి రోగులను కాపాడవచ్చని ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న Sarah Hoosdally అభిప్రాయ పడుతున్నారు. అయితే అది ఇప్పట్లో అయ్యే పని కాదు. ఎందుకంటే దీనికంతటికీ ఎంతో సమయం, ఎంతో మంది నుంచి సేకరించిన సమాచారం అలాగే ఎంతో డబ్బు అవసరం అవుతుంది. కానీ త్వరలోనే ఈ మొండి జబ్బును అంతమొందించే పనిలో ఈ బృందం ఉంది.

ఈ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నది Bill and Melinda Gates Foundation మరియు The Wellcome Trust. వీరి ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం.

Courtesy