https://youtu.be/yUE7hyHDDmg

పట్టణ పరిసరాల్లో పిల్లలను బయటకు తీసుకు వెళ్లేందుకు పుష్ చైర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో పిల్లలను పడుకోబెట్టి ఊరంతా తిప్పడం మనం విదేశాల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అవి మన దాకా కూడా వచ్చేసాయి. చంటి పిల్లలను pram లేదా stroller లలో వేసి అపార్ట్ మెంట్ చుట్టూ తీసుకు వెళ్ళడం, బయట మల్టిప్లెక్స్ లలోను ఎయిర్ పోర్ట్ లలోను ఇంకా ఏదైనా విహార యాత్రకు వెళ్ళినప్పుడు పిల్లలను ఇలా బయట తిప్పుతున్నారు. ఇంత వరకు బానే ఉన్నా, మనం విస్మరించిన సంగతి ఏంటంటే, మన కంటే ఎక్కువగా వారు వాయు కాలుష్యానికి గురి అవుతున్నారని. ఇది మనం అంగీకరించినా, అంగీకరించలేకపోయినా పచ్చి నిజం. మనం అరికట్టలేని ఈ వాయు కాలుష్యం పిల్లలను కూడా బాధిస్తుందని. ఇంకా చెప్పాలంటే, సరిగ్గా భూమికి 30 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తులో అంటే చిన్న పిల్లల తలలు ఉండే ఎత్తులో వాయు కాలుష్యం సాధారణ ఎత్తు గల మనిషి తల ఉండే ప్రదేశం కంటే అధికంగా ఉంటుందట.

అంతకంతకూ గాలిలో విష వాయువులు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో బయట ఉండే వాయు కాలుష్యం నుంచి మన పిల్లల్ని రక్షించేందుకు ఒక తండ్రి పడ్డ తపన నుండి Brizi ecosystem రూపుదిద్దుకుంది. అదేంటో చూద్దామా…
Brizi ecosystem, పేరుకు తగ్గట్టే ఇది చంటి బిడ్డ చుట్టూ విష వాయువులను హరించి స్వచ్చమైన గాలితో ఒక రక్షణ వలయం ఏర్పరుస్తుంది. దీనిని UK కు చెందిన Yosi Romano తయారు చేసారు. ఇది ఒక చిన్న దిండు లాంటి పరికరం. దీనిలో ఒక సెన్సర్, ఎయిర్ ఫిల్టర్ ఉన్నాయి. ఇవి మొబైల్ యాప్ కు అనుసంధానంగా పని చేస్తాయి. దీనిని stroller లేదా pram లో బిడ్డను పడుకోబెట్టినప్పుడు, వారి తలకు దిండులా దీనిని అమర్చాలి. అప్పుడు దీనిలో ఉండే సెన్సర్ విష వాయువల్ని గుర్తించగానే, దీనిలో ఉండే ఫిల్టర్ ఆక్టివేట్ అవుతుంది. ఈ ఫిల్టర్ ఆ గాలిని శుభ్రపరిచి చంటి పిల్లల తల చుట్టూ ఉండే భాగంలో ఈ ఫిల్టర్ ద్వారా స్వచ్చమైన గాలిని ప్రతీ 10 సెకన్లకు ఒక వలయంలా ఏర్పరిచి గాలిని పంపిస్తూనే ఉంటుంది. ఈ Brizi గాలిలో ఉండే విష వాయువులను 80% హరించగలదు. అంతే కాదు ఈ Brizi యాప్ ద్వారా కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతలేవో చెప్పేస్తుంది. అప్పుడు పిల్లలను అటు వైపు తీసుకువెళ్ళక పోవడం మంచిది.

ఈ Brizi ecosystem ను University of Surrey కు చెందిన ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ పరీక్షించారు. రద్దీగా రోడ్డు పై కార్లు తిరిగే చోట ఇది కాలుష్యాన్ని గూర్చి ఖచ్చితమైన సమాచారం ఇవ్వడమే కాదు పిల్లల చుట్టూ ఉండే విష వాయువులను హరించి స్వచ్చమైన గాలి వారి చుట్టూ ఉండేట్టు చేసిందని లాబరేటరీ పరీక్షల ద్వారా తేలింది. దీని ధర $130. ఈ Brizi ecosystem వచ్చే ఏడాది ఆగష్టు నాటికి మార్కెట్లోకి వస్తుంది.

Courtesy