పునర్జన్మ సిద్ధాంతాన్ని మన దేశం తో పాటు మరెన్నో దేశాల్లో, నాగరికతల్లో బలంగా నమ్ముతారు. ఐతే ఆ సిద్ధాంతాల ప్రకారం మరణం తరువాత జీవి ఏమవుతాడో అది ఆ జీవి చేతుల్లో ఉండదు. కానీ ఇప్పుడు అందుకు అవకాశం లేదు. మరణించిన తరువాత మీరు ఏమవుతారో అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ద్వారా ఖచ్చితంగా ముందే చెప్పచ్చు. ఎలాగా అని ఆశ్చర్యంగా ఉంది కదూ. మరిoకేం చదవండి మరి..

BIOS Incube. ఈ పేరు తో పరిచయం ప్రారంభిద్దాం. ఇది ఒక చెట్టును పెంచే కుండీ. కుండీ అంటే అలాంటి ఇలాంటి కుండీ కాదు మానవ భావోద్వేగాలు మరియు సాంకేతికత కలిగిన కుండీ. ముందుగా ఇది అర్ధం కావాలంటే మనకు కొంచెం విశాల దృక్పధం అవసరం. మన వారెవరైనా చనిపోయినప్పుడు వారి చితాభస్మం మనం ఏ గంగలోనో మరో పద్ధతిలోనో దానికి ఒక గతిని ఏర్పరుస్తాం. దీని తరువాత వారితో మనకు సంబంధం పూర్తిగా తెగిపోతుంది. అలా కాకుండా వారి చితాభస్మాన్ని మన కళ్ళ ఎదుటే ఒక చెట్టు రూపంలో పెరుగుతుంటే, దాన్ని మనం నిత్యం చూస్తుంటే. వింటుంటేనే ఎంతో భావోద్వేగానికి గురవుతున్నాము కదూ. సరిగ్గా ఈ ఆలోచనతోనే ఈ BIOS రూపుదిద్దుకుంది. వెళ్లి పోయిన వారిని ఎదో ఒక చెట్టు రూపంలో మన చెంతకు తీసుకు రావడమే వీరి ఉద్దేశ్యం. ఈ విధంగా ప్రపంచంలోని స్మశానాలను మరణించిన వారి స్థలాలుగా కాకుండా జీవం ఉట్టిపడే ఉద్యానవనాలుగా మార్చాలన్నదే వీరి లక్ష్యం. సరే ఇప్పుడు అందుకు ఈ కుండీ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.

మరణించిన వారి చితాభస్మాన్ని ఈ కుండీలో ఉంచి అందులో ఏదైనా ఒక చెట్టు యొక్క విత్తనాన్ని నాటవచ్చు. అప్పుడు ఈ కుండీ లో నీరు పోసి ఉంచడమే మనం చేయాల్సింది. ఇక మీ ప్రియమైన వారిని మొక్కగా పెంచి మీకు అందించే బాధ్యత అంతా ఈ కుండీదే. ఈ BIOS INCUBE కుండీ ఎన్నో సెన్సర్స్ తో తయారయింది. ఈ సెన్సర్స్, విత్తనం మొక్కగా తయారయ్యే దశలో కావల్సినoత నీటిని మాత్రమే విడుదల చేస్తాయి. అటు తర్వాత ఆ మొక్క పెరుగుదలకు అవసరమైన తేమ, వేడిమి, ఎండ వంటి ఎన్నో అంశాలను ఈ కుండీలోని సెన్సర్లు నిరంతరం కనిపెడుతూనే ఉంటాయి. ఏది తక్కువైనా అందుకు తగ్గ సూచనలను ఈ కుండీకి అనుబంధంగా తయారైన యాప్ ద్వారా మనకు అందుతాయి. అందువల్ల మనకు మొక్కలను సంరక్షించడం చేతకాకపోయినా దీని సూచనలు పాటిస్తూ మనకు దూరమైన మన ప్రియమైన వారిని ఓ మొక్క రూపంలో బ్రతికిoచుకోవచ్చు.


అటు పైన వీరు Bios Seed, అనే మరొక అవకాశాన్ని కూడా కల్పించారు. ఇది ఎక్కువగా పశ్చిమ దేశాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరైనా దీని గూర్చి విని తాము మరణానoతరం ఏ మొక్కగా ఉండాలి అనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకుని వారి వివరాలను ఈ సంస్థకు అందచేస్తే, వారి మరణం తరువాత వారి అంత్యక్రియలను ఈ సంస్థ పర్యవేక్షించి వారి చితాభస్మం నుండి వారు కోరిన మొక్క రూపంలో వారిని బ్రతికించి వారికి ప్రియమైన వారికి అందించే సౌకర్యం కూడా ఇందులో ఉంది.

మనకు వినడానికి కొత్తగా అనిపిస్తున్నా ఈ కుండీలు 60,000 కు పైగానే ఇప్పటికే అమ్ముడుపోయాయి అంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఏదేమైనా ఇది మరణానంతరం జీవితం కాదు జీవితానంతరం జీవితం.

Courtesy