సేల్ఫీ ల క్రేజు ఇప్పుడు బాగా ఉంది. పిల్లలు పెద్దలు ఇప్పుడు వారి వారి సేల్ఫీ లను సందర్భం ఏదైనా సరే సేల్ఫీలు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం మొబైల్ ఫ్రంట్ కెమెరా తో తిప్పలు పడాలి. లేదా ఒక సేల్ఫీ స్టిక్ కొనుక్కోవాలి. ఇప్పుడు ఈ సేల్ఫీ స్టిక్ కూడా పాతబడుతుంది అనే చెప్పచ్చు. కారణం దీనిని మించిన సామర్ధ్యం, సౌకర్యం గల సేల్ఫీ డ్రోన్ వచ్చేసింది. అదే ఈ AirSelfie. రండి మరి, ఈ సరి కొత్త సేల్ఫీ డ్రోన్ గురించి తెలుసుకుందాం.
ఇటలీ కి చెందిన Edoardo Stroppiana ఈ AirSelfie డ్రోన్ ను తయారు చేసాడు. ఈయనకు 2014 లోనే ఈ సేల్ఫీ డ్రోన్ ఆలోచన వచ్చింది. దానితో ఆయన రెండేళ్ళు శ్రమించి ఈ పరికరాన్ని తయారు చేసాడు. ఈయన ఈ డ్రోన్ ను AirSelfie Holdings Ltd అనే సంస్థ ద్వారా ఈ డ్రోన్ వ్యాపార మార్కెట్లోకి రానుంది. అయితే డ్రోన్ అంటే అదేదో పెద్దది, ఉపయోగించడం కష్టం అనుకునేరు. కానే కాదు. ఈ డ్రోన్ స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ పరిమాణం లో ఉండి ఉపయోగించడానికి చాలా సులువుగా ఉండటం దీని ప్రత్యేకత. ఈ డ్రోన్ యొక్క నాలుగు రోటర్ల సాయంతో ఇది గాలిలో 65 అడుగుల వరకు ఎత్తుకు ఎగిరి ఫోటోలు వీడియోలు తీయగలదు. ఈ డ్రోన్ లో 5 MP కెమెరా కలిగి ఫుల్ HD వీడియోలను కూడా తీయగలదు. దీనితో వ్యక్తులు లేదా వ్యక్తుల గుంపు చిత్ర విచిత్రమైన భంగిమలలో ఫోటోలు దిగవచ్చు. ఇలాంటి ఈ సేల్ఫీ డ్రోన్ బరువు కేవలం 52 గ్రాములే. దీని ఫ్లైట్ టైం మూడు నిముషాలు.
ఈ AirSelfie ఒక యాప్ ద్వారా పని చేస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు iOS ఫోన్లకు ఉచితంగానే లభిస్తుంది. ఈ యాప్ ద్వారా ఈ డ్రోన్ గాలిలో ఎంత ఎత్తులో ఎక్కడ ఉండాలో సరి చూసుకోవచ్చు. ఇక ఫోటో తీయాలంటే, మన ఫోన్లో మాదిరిగానే ఈ యాప్ లో ఒక్క బటన్ నొక్కితే చాలు ఫోటో వచ్చేస్తుంది. అలా వరుసగా ఎనిమిది ఫోటోలు ఒక్కసారి తీసుకోవచ్చు. ఇక ఈ డ్రోన్ లో సోనార్ సాయంతో ఎత్తు ను అంచనా వేస్తుంది. అంతే కాదు దీనిలో ఉండే మరో చిన్న కెమెరా ద్వారా గాలిలో తన చుట్టూ పక్కల పరిసరాలను గమనించుకుంటూ ఉంటుంది. అంటే ఏ చెట్టు లేదా మరే ఇతర వస్తువులకు తగిలి కింద పడిపోకుండా ఉండడానికి ఈ ఏర్పాటు. అంతే కాదు ఇంకా ఈ డ్రోన్ లో గైరోస్కోప్, బారోమీటర్ మరియు జియోమాగ్నెటిక్ సెన్సర్లు అమర్చబడి ఉన్నాయి.
ఇక తీసిన ఫోటోలను వైఫై ద్వారా ఇది ఎక్కడికైనా పంపిస్తుంది. అలాగే దీనిలో 4GB మైక్రోఎస్డి కార్డు కూడా ఉంది. అంతేనా ఈ యాప్ ద్వారా తీసిన ఫోటోలను వెంటనే సోషల్ మీడియా లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక ఫోటోలు తీయడం పూర్తైన తరువాత దానంతట అదే దాని యధా స్థానానికి వచ్చేస్తుంది. లేదా మనం చేత్తో దానిని గాలిలో నుంచి తీసి భద్రపరచుకోవచ్చు. లిథియం బాటరీ తో పని చేసే ఈ పరికరం ఒక పవర్ బ్యాంకు తో కలిపి వస్తుంది. అంటే ఈ డ్రోన్ ను ఆ పవర్ బ్యాంకు లో ఉంచితే కేవలం అర గoట లో ఛార్జ్ చేసేస్తుంది అన్నమాట. అదే కాదు ఈ AirSelfie డ్రోన్ ను micro USB తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ AirSelfie డ్రోన్ వచ్చే ఏడాది అంటే 2017 మార్చ్ నుంచి అందుబాటులోకి వస్తుంది. దీని ధర $300.