ఈ రోజుల్లో అందరూ చిరు తిళ్ళు తినడానికి ఇష్ట పడుతున్నారు. అందుకే దుకాణాల్లో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా చాలా రెడీమేడ్ ఫుడ్ కు చాలా గిరాకీ ఉంది. రుచిగా ఉందని మనం కళ్ళు మూసుకుని తినేస్తుంటాం. కానీ ఇప్పుడు కళ్ళు తెరిచే సమయం ఆసన్నమయింది. మనకు ఆ ఆహార పదార్ధాలను విక్రయించేందుకు ఉపయోగించే ప్యాకింగ్ లో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పని మనం చేయలేకపోయినా అలా పరిశోధించి అందులో హానికారక రసాయనాలు కలిగి ఉన్నాయని నిరూపిస్తున్నారు అమెరికా పరిశోధకులు.
అమెరికా లోని University of Notre Dame కు చెందిన పరిశోధకులు, ప్రొ. Graham Paeslee (Experimental Nuclear Physics) అమెరికా లోని పేరొందిన ఫాస్ట్ ఫుడ్ చైన్లు అంటే McDonald’s, Starbucks, Burger King వంటి దుకాణాల్లో 400 ప్యాకింగ్ శాంపిల్స్ ను ఫ్లోరిన్ కలిగిన పదార్ధాలు అంటే polyfluoroalkyl substances (PFASs) కోసం పరీక్షించగా అవి – బ్రెడ్ ప్యాకింగ్ లో 56 శాతం, శాండ్విచ్ మరియు బర్గర్ లలో 38 శాతం ప్యాకింగ్ లో ఉపయోగించారని తేలింది. ఇంతకీ ఇదేం చేస్తుంది అనుకుంటే, ఈ కెమికల్ ఆ ఆహార పదార్ధాన్ని కలుషితం చేసి తిన్నప్పుడు మన రక్తంలో కలిసి పోతుంది. మన శరీరంలోకి చేరిన ఈ chemical లోని కనీసం 50 శాతం బయటకి పోవడానికే ఎన్నో సంవత్సరాలు పడుతుoది అంటే ఇది ఎంత హానికారకమో తెలుసుకోవచ్చు. దీని వల్ల థైరాయిడ్ దగ్గర నుంచి కిడ్నీ కాన్సర్ వరకు, పిల్లల్లో మరింత ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోందని Paeslee అంటున్నారు. ఈ ప్యాకింగ్ లోని ఈ PFAS ను కనుగొనడానికి particle-induced gamma-ray emission (PIGE) spectroscopy అనే వినూత్నమైన పద్ధతిని ఈయన ఎంచుకున్నారు.
అన్నిటికంటే ఆశక్తికరమైన అంశం ఏంటంటే తమ దుకాణాల్లోని ప్యాకింగ్లో ఏమి ఉన్నాయో తెలుసా అని ఆయా యజమానుల్ని ప్రశ్నించగా వారు దీనిలో అలాంటి హానికారక కెమికల్స్ ఉండవని పేర్కొన్నారు. అయితే వారి దుకాణాల్లోని శాంపిల్స్ మాత్రం అందుకు విరుద్ధంగా రుజువు చేస్తున్నాయి.
అందువల్ల ఈ PFAS కలిగిన ప్యాకింగ్ కంటే ప్రత్యామ్న్యాయ మార్గాలు అన్వేషించాలని Paeslee అన్నారు. ఎందుకంటే అమెరికా లోని పిల్లల్లో మూడో వంతు ఫాస్ట్ ఫుడ్ ను తింటుండడం వల్ల అమెరికన్ ప్రభుత్వాలు దీని గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.
అమెరికా పరిస్థితే అలా ఉంటే ఇక్కడ మనం ఎలాంటి పరిశోధన అవసరం లేకుండానే మరెన్నో హానికారక పదార్ధాలు ఆహార పదార్ధాల ప్యాకింగ్ లో వినియోగిస్తూ ఉండవచ్చని ఒప్పుకోక తప్పదు. అందువల్ల దీని గూర్చి వస్తాయో రావో తెలియని చట్టాల గురించి ఎదురు చూసే బదులు ఈ ఫాస్ట్ ఫుడ్ విషయంలో ఎవరి ముందు జాగ్రత్త చర్యలు వారు తీసుకోవడం ఉత్తమం.
ఈ పరిశోధన Environmental Science & Technology అనే జర్నల్ లో ప్రచురించబడింది.