గ్లూకోమా అంటే 50 లలో వచ్చే కంటి జబ్బు. దీని వల్ల కంటి చూపు మందగించడం దగ్గర నుంచీ కంటి చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధులలో గుడ్డితనానికి ఇది ఒక ప్రధాన కారణం. అలాగే అమెరికా లోని National Eye Institue ప్రకారం 3 కోట్ల మంది అమెరికన్లు ఈ జబ్బుతో బాధ పడుతున్నారు, అంటే దీని తీవ్రత మనకు అర్ధం అవుతుంది. అయితే ఈ జబ్బు బయట పడిన తరువాత చూపు మందగించకుండా ఉండేందుకు చికిత్సలు ఉన్నాయి కానీ దీనిని ముందుగా గుర్తించడం చాలా కీలకం. దీనిని ముందుగా గుర్తించలేక పోవడం ఒక ఎత్తు అయితే దీనికి ఇంతవరకూ ఎక్కడా శాశ్వత పరిష్కారం లేకపోవడం విచారకరం.
ఇది ఇలా ఉంటే, ఇప్పటికే గ్లుకోమా బారిన పడ్డ రోగులకు వైద్యం చేసేటప్పుడు, వారి వ్యాధి ముదురుతున్నదా లేక మందులకు నయం అవుతున్నదా తెలియాలంటే ఒక్కటే మార్గం. అది రోగులు తమ కను గుడ్డు ఒత్తిడి (eye pressure) ఎలా ఉందో ఎప్పటికప్పుడు కంటి వైద్యుని చేత చూపించుకుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడూ వైద్యుని దగ్గరకు వెళ్ళే కంటే, అసలు నిరంతరం తమ కంటి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు Columbia University Medical Center కు చెందిన పరిశోధకులు ఒక స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్ (Sensimed Triggerfish) ని కనిపెట్టారు. వీరి అభిప్రాయం మేరకు గుండెకు ECG ఎలాగో, గ్లుకోమా పేషెంట్లకు ఈ స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్ ఆ విధంగా పని చేస్తుందని ఈ బృందం అభిప్రాయ పడింది. అదెలాగో చూద్దాం.
ఈ కాంటాక్ట్ లెన్స్ ను రాత్రి పగలు రోగులు ధరించాల్సి ఉంటుంది. అప్పుడు నిద్రలో కను గుడ్డు నిద్రిస్తున్నప్పుడు కంటి లెన్సు మీద పడే వత్తిడిని అందులో మార్పును బట్టి ఈ వ్యాధి తీవ్రతను నిర్ధారించవచ్చు. అయితే ఈ ఒత్తిడి పగలు ఒకలా రాత్రి నిద్రిస్తున్నపుడు ఒకలా ఉండడం వల్లనే, నిరంతరం దానిని గమనించేందుకు ఇలాంటి కాంటాక్ట్ లెన్స్ అవసరం అయింది. ఈ స్మార్ట్ లెన్స్, పడుకున్నప్పుడు కను గుడ్డు లోని లెన్సు మీద పడే వత్తిడికి ఆ లెన్సు మార్పు చెందే curvature ను గమనిoచి ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ ద్వారా ఈ సమాచారాన్ని ఒక వైర్లెస్ పరికరానికి పంపిస్తుంది. అలా 24 గంటలూ వచ్చిన సమాచారాన్ని సేకరిస్తే ECG మాదిరి ఉంటుంది అని ఈ బృందం అంటున్నారు.
ఇక అక్కడి నుంచీ వచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఈ వ్యాధి ముదురుతున్నదీ లేనిదీ చెప్పవచ్చు అంటున్నారు Columbia University Medical Center కు చెందిన C. Gustavo De Moraes అనే పరిశోధకులు. దీని వల్ల పేషంట్ల కంటి గ్లూకోమా వైద్యం ఎలా సాగుతుందో తెలుసుకోవచ్చు అంటున్నారు వీరు.
ఇటువంటి అంతుబట్టని రోగాలకు ఇలాంటి పరిష్కారాలు చూపడమే నిజమైన మేధస్సు అనిపించుకుంటుంది కదూ. ఏది ఏమైనా దీని మీద విస్తృతమైన పరిశోధన మాత్రం జరగాల్సి ఉంది.