విజ్ఞ్యానం ఊహకందని సౌకర్యాలను మనకు అందుబాటులోకి తీసుకొస్తోంది. అందులోను మొబైల్ ద్వారా మరింత మెరుగైన సాంకేతికత మన అర చేతుల్లోకే వచ్చి చేరుతోంది. ఈ మొబైల్లో ఉండే సెన్సర్ ల ద్వారా వ్యక్తులను గుర్తించగలగడం (identification), తద్వారా దీనిని మరిన్ని స్మార్ట్ అప్లికేషన్లకు అనుసంధానం చేసి ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు అలాంటిదే మరొక పరిజ్ఞ్యానాన్ని వృద్ధి చేసారు University of St. Andrews కు చెందిన పరిశోధకులు. గూగుల్ సహకారంతో, గూగుల్ తయారు చేసిన ఒక రాడార్ సెన్సర్ Soli తో RadarCat అనే సాంకేతిక పరిజ్ఞ్యానాన్ని అభివృద్ధి చేసారు. ఆ వివరాల్లోకి వెళ్తే
గూగుల్ సంస్థ తమ Project Soli alpha developer kit program లో భాగంగా ఒక రాడార్ సెన్సర్ ను తయారు చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే మన అర చేతిలో ఇమిడే ఈ సెన్సర్ మన శరీరానికి సంబంధించి అతి సూక్ష్మమైన కదలికలను కూడా గుర్తించగలదు. ఈ రాడార్ సెన్సర్ మన చేతి వేళ్ళ కదలికలను కనిపెట్టేస్తుంది. ఇక ఈ సెన్సర్ను ఉపయోగించి లండన్ లోని University of St. Andrews లోని St Andrews Computer Human Interaction (SACHI) కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్తలు RadarCategorization ను వృద్ధి చేసారు. అంటే ఏ వస్తువునైనా సరే, ఈ సెన్సర్ మీద ఉంచితే దీని సిగ్నల్స్ ద్వారా అది ఏ వస్తువు అనేది ఈ సెన్సర్ చెప్పేస్తుంది. అది మీరు పైన వీడియో లో చూడవచ్చు. ఇది ఎలాగంటే ప్రతీ వస్తువుకు ఒక నిర్దిష్టమైన frequency ఉండడం చేత ఈ సిగ్నల్స్ అంత ఖచ్చితంగా చూపించడం సాధ్యమవుతుంది. ఇది ఎంత ఖచ్చితంగా చూపిస్తుంది అంటే ఖాళీ గ్లాస్ ను, అలాగే దానిలో మరో ద్రవం తో నిండి ఉన్న గ్లాస్ ను కూడా అంతే ఖచ్చితంగా చెప్పేస్తుంది.
అంతే కాదు ఇది మన చుట్టూ ఉండే అన్ని రకాల వస్తువులను గుర్తించడం దీని ప్రత్యేకత. అంతే కాదు ఒకే పరిమాణం లో ఉన్న బాటిళ్ళ లోని వేరు ద్రవాలను కూడా వేరుగా గుర్తించగలదు. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే దీని మీద పళ్ళ నుంచి ఫోన్ మరియు ఐపాడ్/టాబ్లెట్ వరకు ఏ వస్తువునైనా గుర్తించగలగడం విశేషం. ఆపైన ఇది మనుషుల శరీర అవయవాలను కూడా గుర్తించగలదు. దీనిని చొక్కా, మణికట్టు, పొట్ట మీద మరెక్కడ పెట్టుకున్నా సరే, ఆ అవయవాన్ని గుర్తించగలదు.
సరే దీని వల్ల ఏమిటి ప్రయోజనం అనుకుంటున్నారా ఇటువంటి పరికరం వల్ల మనం కంప్యూటర్ తో కానీ మొబైల్ తో కానీ మన బాహ్య ప్రపంచంతో మనం వ్యవహరించే తీరు లో పెను మార్పులకు కారణం కాగలదు. ముఖ్యంగా భద్రతా వ్యవస్థలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ RadarCat ను మొబైల్ లో అందుబాటులోకి తీసుకొస్తే దీనిని మన మణికట్టు మీద పెట్టగానే ఇది మన మొబైల్ లో clock ను చూపిస్తుంది. అలాగే దీనిని పొట్ట మీద పెట్టుకోగానే recipe app లను చూపిస్తుంది. అలాగే దీనిని నావిగేషన్, చూపు లేని వారికి దైనందిన జీవితంలో తమ చుట్టూ ఏముందో తెలుసుకునేందుకు ఇంకా మొబైల్ ను మరింత సరళీకృతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.