స్మార్ట్ ఫోన్లను అందులోని ఫీచర్ ల గూర్చి ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఎన్నో సంస్థలు ఎన్నో కొత్త కొత్త ఫీచర్లు, యాప్ లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఒక ఫీచర్, మొత్తం స్మార్ట్ ఫోన్ వినియోగించే పద్ధతినే మార్చబోతోంది. అదేంటంటే స్మార్ట్ ఫోనును కంటితో సైతం ఉపయోగించగలగడం.
జర్మనీ లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్మాటిక్స్ (Max Planck Institute for Informatics), అమెరికా లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (Massachusetts Institute of Technology) మరియు యూనివర్సిటీ అఫ్ జార్జియా (University of Georgia) కు చెందిన పరిశోధకులు స్మార్ట్ ఫోనులో ఒక కొత్త సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. ఇది ఫోను స్క్రీన్ మీద మనిషి కళ్ళను 1 సెంటీమీటర్ మరియు tablet లో 1.7 సెంటీమీటర్ పరిధి మేరకు వ్యక్తి కళ్ళు ఎక్కడ చూస్తున్నాయో చెప్పేస్తుంది. దీని వల్ల ఫోనును చేతి వేళ్ళ అవసరం లేకుండానే నియంత్రించవచ్చు.
అయితే ఇది కూడా వాణిజ్యపరంగా సరిపోదు అంటున్నారు ఈ పరిశోధకుల్లో ఒకరైన ఆదిత్య ఖోస్ల. ఇందుకు మూలమైన eye tracking అనే విధానం ఇప్పటికే కొన్ని రంగాల్లో అందుబాటులో ఉంది. కానీ ఇది ఎంతో ఖరీదైనది. ఇది అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీనిని మొబైల్ ఫోనులోకి తీసుకురావడమే వీరి లక్ష్యం. ఇందుకోసం ఈ బృందం ముందుగా GazeCapture అనే యాప్ ను రూపొందించారు. ఇది ప్రధానంగా ఫోనులోని ఫ్రంట్ కెమెరా ద్వారా వ్యక్తుల కంటి కదలికలను రికార్డు చేయగలిగింది. అటు పైన ఈ సమాచారం మొత్తాన్ని iTracker అనే సాఫ్ట్ వేర్ కు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగపడింది. అంటే, ఈ సమాచారం ద్వారా ఈ సాఫ్ట్ వేర్ వ్యక్తుల ముఖము, కళ్ళు ఇవి ఉన్న విధానాన్ని బట్టి ఇది వ్యక్తుల కళ్ళు ఫోను మీద ఖచ్చితంగా ఎక్కడ చూస్తున్నాయో విశ్లేషిoచగలిగింది.
అయితే ఇప్పుటి దాకా 1500 మంది ఈ GazeCapture అనే యాప్ ను ఉపయోగించారనీ, సుమారు 10,000 మంది నుంచీ సమాచారాన్ని సేకరించగలిగితే ఈ iTracker సాఫ్ట్ వేర్ ను మరింత మెరుగుపరచి ఒక్క మిల్లీమీటర్ పొల్లు పోనoత ఖచ్చితంగా కేవలం కళ్ళ కదలికలతోనే స్మార్ట్ ఫోన్ వినియోగించేలా చేయవచ్చనీ వీరు పేర్కొన్నారు.
సరే, కళ్ళతో ఉపయోగిస్తే ఏంటి అనుకుంటున్నారా. స్మార్ట్ ఫోను లో eye tracking అందుబాటులోకి వస్తే ఇక పై పాస్ వర్డ్ ల అవసరం ఉండదు. ప్రతీ వ్యక్తి యొక్క కను గుడ్డు తీరు మరొకరి కంటే భిన్నంగా ఉండటం వల్ల దీని ద్వారా సోషల్ మీడియా, ఈ కామర్స్ వంటి వాటిలో భద్రంగా విహారం చేయవచ్చు.
ఇది అందుబాటులోకి వస్తే హాకింగ్ వంటి వాటికి నియంత్రించవచ్చు. చూద్దాం మరి ఇది అందరికీ ఇప్పుడు అందుబాటులోకి వస్తుందో.