సెల్ ఫోన్ (చరవాణి) వచ్చాక ఈ ప్రపంచమంతా చాలా చిన్నది అయిపొయింది. అందులోను ఆ చరవాణి లోకి అంతార్జాలం వచ్చి చిక్కుకున్నాక మరీ చిన్నది అయిపొయింది. ఎందుకంటే దీనితో ప్రపంచంలో ఇక్కడ ఉన్న వారినైనా చూడచ్చు, మాట్లాడచ్చు ఏ సమాచారమైనా తెలుసుకోవచ్చు. ఇక ప్రస్తుత ట్రెండ్ ప్రకారం సెల్ ఫోన్, లాప్టాప్, టీవి, స్మార్ట్ వాచ్, ఇంకా ఏమైనా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే అవి ఒకదానికొకటి అనుసంధానంగా పని చేసేస్తున్నాయి. దాంతో ఒక దాంట్లో దాచిపెట్టిన సమాచారాన్ని మరొక దాంట్లో సులభంగా చూడవచ్చు.
సరిగ్గా ఈ సౌకర్యమే కొంత ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఎదో అవసరం కోసం సెల్ ఫోన్ లోనో మరో దేన్ట్లోనో దాచుకున్న సమాచారం కాస్తా హాకర్ల పాలు అవుతోంది. సైబర్ సెక్యూరిటీ పెద్ద జటిలమైన సమస్యగా తయారైంది. అందువల్ల ఈ హాకర్ల నుండి, మన చుట్టూ ఉండే దొంగల నుండి మన సెల్ ఫోన్లు భద్రంగా ఉండేందుకు పరిశోధకులు చాలా మార్గాలే అన్వేషిస్తున్నారు. అందులో ఒక నూతన పద్ధతి ఈ ఒంటి చెమట తో ఎలక్ట్రానిక్ పరికరాలను అన్లాక్ చేయడం. సహజంగా ఇందుకోసం మన ఫోన్ లేదా లాప్టాప్ లేదా ఐపాడ్ మరే ఎలక్ట్రానిక్ వస్తువుకైనా ఒక పాస్వర్డ్ లేదా పాటర్న్ పెట్టుకుని భద్రంగా ఉందిలే అని భ్రమ పడుతుంటాం. కానీ అవి ఏ మాత్రం భద్రం కావని బయటపడుతున్న సైబర్ క్రైమ్ ఉదంతాల ద్వారా తెలుస్తుంది. దీనికి పరిష్కారంగానే University at Albany కు చెందిన కెమిస్ట్రీ అసిస్టంట్ ప్రొఫెసర్ Jan Halámek ఒంటి చెమటను ఎలక్ట్రానిక్ వస్తువులకు పాస్వర్డ్ గా పెట్టచ్చు అని రుజువు చేసారు. ఎందుకంటే ఒక్కొక్కరి ఒంటి చెమట మరొకరి కంటే భిన్నంగా ఉంటుంది. ఈ చెమటలో ఉండే రసాయనాల ద్వారా వైద్యులు, పరిశోధకులు ఆ వ్యక్తి గురించిన చాలానే సమాచారం తెలుసుకుంటున్నారు.
అందువల్ల Jan ఒంటి చెమట ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలను అన్లాక్ చేయగలిగే (sweat based bio metric authentication) పద్ధతిని ప్రతిపాదించారు. Jan ప్రకారం ఒంటి చెమటలో చాలా చాలా రసాయనాలు ఉంటాయి. ఒక వ్యక్తి నుండి వెలువడే చెమట ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటుంది. అంటే రాత్రి పూట పని చేసే వారి నుండి ఒక రకం రసాయనాలు బయటకి వస్తే, అదే వ్యక్తి ఉదయం పని చేసేటప్పుడు మరో రకం రసాయనాలు శరీరం నుండి వెలికి వస్తాయి. Jan పద్ధతి ప్రకారం, ముందు వినియోగదారుడి sweat profile ను తయారు చేస్తుంది. దీనికి కొంత సమయం తీసుకుంటుంది. అటు పైన ఆ వ్యక్తి ఎప్పుడు ఫోన్ పట్టుకున్నా అతనో కాదో తెలుసుకుని అన్లాక్ చేస్తుంది. ఈ పద్ధతిలో వినియోగదారుడు తప్ప మరెవ్వరూ ఫోన్ లేదా ఆ వస్తువును అన్లాక్ చేయలేరు. ఈ sweat profile ద్వారా వ్యక్తి వయసు, లింగం, ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. అందువల్ల ఇది ఒక పటిష్టమైన భద్రత అని అంటున్నారు Jan. దీనిని మరెవ్వరూ హాక్ చేయలేకపోవడం దీని ప్రత్యేకత.
Jan ప్రతిపాదించిన ఈ sweat based biometric authentication ఫోరెన్సిక్ రీసెర్చ్ లోను ఉపయోగపడుతోంది. అంటే ఏదైనా క్రైమ్ జరిగిన తరువాత క్రిమినల్స్ ను పట్టుకోవడానికి కూడా ఇది ఎంతో దోహదం చేస్తోందట.
ఈ sweat based biometric authentication కొద్ది కాలంలోనే మన ఫోన్లలో అందుబాటులోకి రావచ్చు. ఈ పరిశోధనను ChemPhysChem అనే జర్నల్ లో ప్రచురించారు.