వైద్య శాస్త్రం అభివృద్ధి చెందే కొద్దీ ఎన్నో మొండి వ్యాధులకు మందులు కనుగొన్నారు. ఇక పై జబ్బుల బారిన పడిన తరువాత రోగ నిర్ధారణ కంటే మనుషులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారికి భవిష్యత్తులో రాబోయే జబ్బుల గురించి తెలుసుకోగలిగితే వారిని గుర్తించి కాపాడవచ్చు. సరిగ్గా ఇప్పుడు చాలా మంది పరిశోధకులు దీని పట్లే శ్రద్ధ పెడుతున్నారు. ఇందులో భాగంగా మానవ శరీరం నుంచి వెలువడే పలు రకాల వ్యర్ధాల అంటే చెమట, మూత్రం, మలం మొదలైన వాటి నుంచి కూడా భవిష్యత్తులో రాబోయే జబ్బులను నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ పద్ధతి ఈ నాటిది కాదు. కొన్ని వందల సంవత్సరాల పూర్వం కూడా ఆనాటి వైద్యులు ఊపిరి, చెమట, మూత్రం మొదలైన వాటి ఆధారంగా రోగ నిర్ధారణ చేసేవారు.

సరిగ్గా దీనిని ఆధారం చేసుకుని Technion – Israel Institute of Technology కి చెందిన Dr. Hossam Haick, 56 మంది పరిశోధకులతో కూడిన ఒక బృందానికి నేతృత్వం వహించారు. ఈ బృందం ఊపిరి ఆధారంగా భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్ణయించేందుకు ఒక బ్రీతలైజర్ ను తయారు చేసారు. అందులో మన ఊపిరిలో వెలువడే VOC (Volatile Organic Compound) ఆధారంగా మనకు రాబోయే జబ్బులను ముందుగానే గుర్తించవచ్చు. ఇందులో ఊపిరితిత్తుల కాన్సర్, ఒవారియన్ కాన్సర్ వంటి 17 రకాల జబ్బులను గుర్తించవచ్చు. దీనిని చైనా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, అమెరికా మరియు లాట్వియా వంటి దేశాల్లో 813 మంది పేషెంట్లకు ఉపయోగించగా ఇది 86 శాతం మేర సరిగ్గా వారికి రోగనిర్ధారణ చేసింది.

సరే ఇంతకీ ఈ VOC ఏంటి ఈ బ్రీతలైజర్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రతీ వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ ఉన్నట్టే, ప్రతీ వ్యక్తి ఊపిరి మరో వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. దీనినే breathprint అంటారు. దీనిలో ఎన్నో రకాల రసాయన పదార్ధాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఈ VOC లు. ఒక వ్యక్తి ఊపిరిలో ఏ ఏ VOC లు ఉన్నాయి వాటి శాతం, హెచ్చు తగ్గులను బట్టి ఈ బ్రీతలైజర్ రోగనిర్ధారణ చేస్తుంది.

ఇక ఈ బ్రీతలైజర్ లో రెండు భాగాలు ఉన్నాయి. ఒక భాగం సెన్సర్లతో కూడినది మరొకటి software కలిగి ఉంది. మొదటి భాగంలో నానో ట్యూబ్ లతో కూడిన కార్బన్ పొర, మరొకటి కార్బన్ లేని నానో పొర. ఈ పరికరంలోకి మొదట సాధారణంగా ఊపిరి ఊదాలి. అటు పైన ఊపిరి ని బలంగా ఊదాలి. అలా ఊదగానే అందులోని VOC లు ఈ కార్బన్ కలిగిన నానో పొరలకు అతుక్కుని ఎలక్ట్రికల్ కండక్టివిటీ (విద్యుత్తు) కి కారణమవుతుంది. ఇలా మొదటి సారి, రెండవ సారి ఊదినప్పుడు మధ్య కలిగిన తేడాను బట్టి ఊపిరిలో VOC ల శాతం నిర్ణయింపబడుతుంది. ఇప్పుడు ఈ software ద్వారా ఆ VOC లు ఏ ఏ జబ్బు కలిగిన వారికి ఉండవచ్చో తెలుస్తుంది.

ప్రస్తుతం దీనిని విదేశాల్లో చాలా ఆసుపత్రుల్లో దీని పని తీరును పరీక్షిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఇది వైద్యులకు రోగ నిర్ధారణ చేయడానికి చాలా చవకైన, సులభమైన మార్గమని పేర్కొన్నారు Haick. ఈ పరిశోధన journal ACS Nano లో ప్రచురించబడింది.

Courtesy