మూర్చ వ్యాధి (epilepsy). ఇది ఒక బాధాకరమైన వ్యాధి. దీని తీవ్రత ఎక్కువ ఉంటే అది రోగి శారీరక, మానసిక, సామాజిక జీవితానికే గొడ్డలి పెట్టు లాంటిది. ఈ వ్యాధిగ్రస్తులు జీవితంలో ఏం చేద్దామన్నా వారి ఆరోగ్య పరిస్థితి అడ్డంకిగా మారుతుంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది ఈ జబ్బు తో బాధ పడుతున్నారు. ఏ సమయంలో ఈ మూర్చ వస్తుందోనని ప్రతీ క్షణం వీరిని కనిపెట్టుకొని ఉండాలి.
ఈ వ్యాధికి మందులు ఉన్నా తీవ్రంగా ఉన్నటువంటి వారికి, అంటే పుట్టుకతో వచ్చిన వారికి వైద్యం చాలా సంవత్సరాలే పడుతుంది. ఈ లోపు చికిత్స లో భాగంగా వారికి రోజులో వచ్చే మూర్చను తగ్గించి వారికి సాధారణ జీవితాన్ని ఇచ్చేందుకు వైద్య శాస్త్రంలో ఒక కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. అదే ఈ RNS Stimulator. దీనిని కాలిఫోర్నియా కు చెందిన Neuropace అనే సంస్థ తయారు చేసింది. దీనిని హవాయి లోని Queens Medical Center Hospital, కు చెందిన వైద్యులు Alan Stein అక్కడి రోగుల మీద ఉపయోగించగా సత్ఫలితాలు వచ్చాయి. ఇక ఈ పరికరం ఎలా వ్యాధిని నయం చేస్తుందో చూద్దాం.
ఈ పరికరం మన బొటన వేలంత ఉంటుంది. దీనిని రోగి మెదడులో ఈ వ్యాధికి గురి చేస్తున్న భాగంలో అమర్చుతారు. ఇది రోగికి మూర్చ వచ్చే సంకేతాలను గుర్తించి ఈ పరికరం ద్వారా మెదడును విద్యుత్ తరంగాలకు గురి చేస్తుంది (electrical burst of simulation). తద్వారా మూర్చ రాకుండా చేస్తుంది. ఇక రోగి ప్రతీ రోజు ఒక లాప్టాప్ కు అనుసంధానం చేయబడిన ఒక wand తో తల మీద ఈ RNS Simulator ను అమర్చిన భాగంలో దీనితో రుద్దడం వల్ల మెదడులో ఈ పరికరం ద్వారా జరుగుతున్న మార్పులను ఒక సర్వర్ కు చేరుస్తుంది. ఈ సమాచారాన్ని అంతా ఆ రోగిని పర్యవేక్షిస్తున్న వైద్యుడు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
దీనివల్ల రోగికి రోజూలో చాలా సార్లు వచ్చే మూర్చ చాలా వరకూ తగ్గిపోయిందని, దీనిని ఉపయోగించిన వారి అభిప్రాయం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞ్యానంతో కూడి వైద్య శాస్త్రం రోగులకు ఇటువంటి అద్భతమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.