తెలుగు వారి తొలి పండుగ ఉగాది. ప్రముఖ పండుగలలో ఇదీ ఒకటి. ఉగాది (Ugadi ) అంటే తెలుగు సంవత్సరాది తొలిరోజు అని అర్థం. ఉగాదినాడు కచ్చితంగా తయారుచేయాల్సిన ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. ఉగాది పచ్చడి(Ugadi Pachadi) తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల(Shadruchulu) సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో తీసుకోవాలన్న  సందేశాన్ని ఈ పచ్చడి తెలుపుతుంది.

ఈ పచ్చడి కొరకు చెరకు రసం(Sugarcane juice), అరటి పళ్లు(Banana), మామిడి కాయలు(Raw Mango), వేప పువ్వు(Neem Flower), చింతపండు(Tamarind), జామకాయలు(Guava), బెల్లం(Jaggery) మొదలైనవి వాడుతారు. మరి ఉగాది పచ్చడి తయారీ(Recipe) విధానం ఈ చేయాలో ఇక్కడ చూద్దాం!

ఉగాది పచ్చడికి కావలసినవి:

మామిడికాయ – 1

వేప పువ్వు- 1/2 కప్పు

సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు

కొత్త చింతపండు- 100 గ్రాములు

కొత్త బెల్లం- 100 గ్రాములు

మిరపకాయలు- 2 (ఆప్షనల్)

అరటిపండు – 1

జీడిపప్పు పలుకులు – తగినంత

ఎండు ద్రాక్ష / కిస్స్మిస్స్  – తగినంత

చెరుకు రసం లేదా చెరుకు ముక్కలు – సరిపడా

ఉప్పు , నీళ్లు – సరిపడేంత

అవసరమైతే అరటి పళ్లు, జామకాయలను కూడా వేసుకోవచ్చు.

తయారు చేసే విధానం:

ముందుగా వేపపువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తర్వాత దాని గుజ్జును వేరుచేయాలి. మామిడికాయను, మిరపకాయలు, కొబ్బరిని సన్నగా తరగాలి. తర్వాత చెరకు రసం సిద్ధం చేసి, మిగతా పళ్లను వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి. ఈ మిశ్రమంలో మామిడి కాయ ముక్కలు, తరిగిన కొబ్బరి, మిరపకాయ ముక్కలను వేసి చివరిగా ఒక అర స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్టే. ఇక వసంత లక్ష్మీని ఆహ్వానించి, నైవేద్యంగా సమర్పించి, తర్వాత స్వీకరించాలి. అంతేకాదు మిగతా వాళ్లకు ఈ పచ్చడిని పంచి పెట్టాలి. కష్ట సుఖాలను జీవితంలో చవిచూడాలనే వాస్తవాన్ని  ఉగాది పచ్చడి తీసుకోవడం ద్వారా తెలియజేస్తుంది.

శోభకృత  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు