ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యొక్క ముఖ్యమైన ఆహారం వరి. మన దేశం తో పాటు మరి కొన్ని దేశాలైన చైనా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ మొదలైనవి వరి ని పండిస్తాయి. ప్రజా జీవనంలో ముఖ్య భూమికను పోషించే వరి మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. వరి యొక్క దిగుబడులు పెంచి అన్నదాతకు ఉపయోగపడాలని ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికి మరో కోణం, ఈ వరి పంట నుంచి పర్యావరణం లోకి విడుదల అయ్యే గ్రీన్ హౌస్ గ్యాస్ (GHG) లను నియంత్రించడం.
ప్రపంచ దేశాల్లో ఇటువంటి పరిశోధనలు చాలా దేశాలు చేపట్టాయి. మన దేశం నుంచి CRRI (Central Rice Research Institute) మొదలైన సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ నేపధ్యం లో స్వీడన్ లోని “University of Agricultural Sciences” కు చెందిన Chuanxin Sun మూడు సంవత్సరాల పాటు వరి పొలాల్లో పరిశోధన చేసి ఈ పంట నుంచి పర్యావరణం లోకి విడుదల అయ్యే మీథేన్ గ్యాస్ ను చాలా వరకు నియంత్రించవచ్చని కనుగొన్నారు. అదెలాగంటే బార్లీ లోని ఒక జన్యువు (gene) ను సాధారణ వరి మొక్కకు కలిపి ఒక కొత్త వరి మొక్కను తయారు చేసారు. ఈ మొక్క తనలో ఎక్కువ కార్బన్ ను గ్లూకోస్ మరియు స్టార్చ్ గా నిక్షిప్తం చేసుకుంటుంది. ఈ విధంగా తక్కువ కార్బన్ మొక్క యొక్క వేర్లకు చేరడం వల్ల అది తిరిగి భూమిలోకి ఇంకి అక్కడ వుండే సూక్ష్మ జీవులు దానిని మీథేన్ గా మార్చకుండా చేస్తుంది. అంతే కాదు ఈ కొత్త రకం వరి వల్ల మొక్కకు 43 శాతం మేర దిగుబడి పెరుగుతుంది.
ఈ పరిశోధన లోని కొత్త రకం వరి రైతులకు అందుబాటులోకి రావాలంటే మరో 10 నుంచి 20 ఏళ్ళు పడుతుంది. దీనిని పూర్తి స్థాయిలో పరీక్షించి కానీ ఇది మార్కెట్లోకి అందుబాటులోకి రాదు అంటున్నారు Chuanxin Sun. ఈ పరిశోధనలు ఫలవంతమైతే అన్నదాత లకు ఇది నిజంగా శుభవార్తే.