చెట్లు పర్యావరణానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే మనం ఇదే వేదిక మీద చెట్ల గురించి మూడో సారి చెప్పుకుంటున్నాం. గతంలో చెట్లు న్యూక్లియర్ రేడియేషన్ ను హరించడం, చెట్లు కొంత పరిధి మేర ఆయుధాలను గుర్తించడం సైతం మనం చెప్పుకున్నాం. ఈ సారి చెట్లు వీధి లైట్లు లా మారి మనకు ఎలాంటి విద్యుత్తు అవసరం లేకుండా కాంతిని ఎలా ఇస్తాయో చూద్దాం. కొన్ని దశాబ్దాల క్రితం పెద్ద వారు వీధి దీపాల కింద కూర్చుని చదువుకున్నాం అని చెప్పుకునే వారు. కానీ ఆ తరువాత అంతటా విద్యుత్తు సౌకర్యం రావడంతో అలా చదువుకున్న వారి సంఖ్య ఇప్పుడు సున్నా. అది పక్కన పెడితే చెట్లు కాంతిని ఇవ్వగలిగితే ప్రపంచవ్యాప్తంగా 20 శాతం మేర విద్యుదుత్పత్తిని ఆదా చేయవచ్చు అంటున్నారు అమెరికా లోని MIT కి చెందిన పరిశోధకులు.
MIT లోని Chemical Engineering ప్రొఫెసర్ Michael Strano తన బృందంతో నాలుగు రకాల మొక్కల మీద చేసిన పరిశోధన ద్వారా చెట్లు కొన్ని గంటల పాటు చీకట్లో కాంతిని వెదచల్లగలవు అని నిరూపించారు. తద్వారా ఒక ఇంట్లో ఒక చిన్న బల్బ్ మాదిరి ఆ కాంతిలో కూర్చుని చదువుకోవడానికి సరిపోయే కాంతిని ఇస్తుందట. ఈ ఆలోచనకి కూడా ప్రకృతే స్ఫూర్తి. మిణుగురు పురుగులలో ఉండే Luciferin అనే మాలిక్యుల్ ను తీసుకుని దానిని మొక్కలలోకి చొప్పించి అక్కడ జరిగే రసాయనిక చర్య ఫలితంగా మొక్కలు కాంతిని కొన్ని గంటల పాటు ఇస్తాయి. Strano Kale, Spinach, Watercresse అనే మూడు రకాల మొక్కల మీద ఈ ప్రయోగం చేసారు. ఈ ప్రయోగంలో మొక్కల ఆకుల మీద ఈ Luciferase మరియు Co Enzyme A అనే రసాయనాలను నానోపార్టికల్స్ రూపంలో చొప్పించి ఆ పైన ఆ మొక్కలను ఒక ద్రావకంలో భద్రపరిచారు. ఆ పైన ఈ మొక్కలను high pressure కు లోను చేయడం ద్వారా ఈ Luciferase మరియు Co Enzyme A మొక్కల ఆకుల్లోకి పీల్చుకుని మొక్క మొదళ్ళలోకి ప్రవేశిస్తుంది. తద్వారా రసాయనిక చర్య జరిగి Luciferin వెలువడుతుంది. లుసిఫెరిన్ అంటే మిణుగురు పురుగు మాదిరి కాంతి మొక్కంతా కొన్ని గంటల పాటు వ్యాపిస్తుంది.
గతంలో కూడా మొక్క నుండి కాంతి వెలువడటానికి మొక్కలో జన్యుపరమైన మార్పులు చేయాల్సి వచ్చేది. ఇది చాలా శ్రమతో, చాలా సమయం వెచ్చించి చేయాల్సిన పని. కానీ Strano కనుగొన్న పద్ధతి ద్వారా ఏ మొక్క నుంచైనా ఈ పద్ధతిలో కాంతిని వెదజల్లెలా చేయవచ్చు. అయితే Strano ఈ ప్రయోగం ద్వారా మరో అడుగు ముందుకేసి ఒక్కసారి Luciferin అందిస్తే జీవిత కాలం మొక్కలు కాంతిని వెదజల్లెలా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఇవి ఫలించే అవకాశం కూడా ఉంది అంటున్నారు MIT పరిశోధకులు.
ఒక్కసారి ఊహించండి మీ ఇంట్లో విద్యుత్తును వినియోగించే బల్బుల కన్నా సహజంగా ఇంటిని కాంతిమయం చేసే మొక్కలు ఉంటే ఎంత బావుంటుంది. అలాగే రోడ్డు పక్కన ఉండే చెట్లు చీకటి పడగానే ఇలా కాంతిని వెదజల్లితే ఎంతో ఆహ్లాదంగా కూడా ఉంటుంది కదూ. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు భవిష్యత్తులో అమల్లోకి రాబోయే శాస్త్రీయ పద్ధతి కూడా.