గూగుల్ సంస్థ ఏం చేసినా దాని వెనుక ఎంతో పరిశోధన, కృషి చివరిగా వినియోగదారులకు ఎంతో ఉపయోగమూ ఉంటుంది కదూ. ఈ సారి, గూగుల్, వస్త్ర సంస్థ అయిన Levi’s తో కలిసి ఒక సరి కొత్త జాకెట్ ను రూపొందించింది. ఇది ప్రధానంగా బైకర్స్ అంటే, ఎక్కడికైనా బైక్ మీద వెళ్ళే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే, ఇది మన కంటే అమెరికా వంటి దేశాల్లోని వారికి సరిగ్గా సరిపోతుంది. కానీ ఇందులోని సాంకేతికత గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి.
మొట్ట మొదటి సారిగా మనం ఒంటికి వేసుకునే బట్టల్లో ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చి సాధారణ జాకెట్ ను స్మార్ట్ జాకెట్ గా మార్చేసారు. ఇక ఈ జాకెట్ గురించి చెప్పాలంటే, levi’s వారు తయారు చేసిన ఈ జాకెట్ అందం, సౌకర్యం తో పాటు, మీకు బైక్ మీద వెళ్ళేప్పుడు మీ దృష్టి రోడ్ మీద నుండి తొలగకుండా మీకు కావాల్సిన సమాచారాన్ని మీకు ఇస్తుంది. అదెలాగో చూద్దాం.
ఇది మన మణికట్టు వద్ద జాకెట్ లో కనిపించకుండా ఒక చిన్న ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చారు. ఇది మన ఫోనుకు అనుసంధానం చేయబడి పని చేస్తుంది. దీని ద్వారా మీరు ఫోన్ అవసరం లేకుండానే, ప్రయాణంలో ఫోన్ కాల్స్ తీసుకోవచ్చు, మ్యూజిక్ వినచ్చు, నావిగేషన్ కూడా దీని ద్వారా చేయవచ్చు. అన్నిటికీ చిన్న పాటి చేతి కదలికల ద్వారా మీకు కావాల్సిన సమాచారం మీరు పెట్టుకున్న హెడ్ ఫోన్స్ లోకి వచ్చేస్తుంది. ఈ పరికరం మన చూపుడు వేలంత ఉండి, కనపడకుండా ఈ జాకెట్ లోపల అమర్చబడుంది. ఈ పరికరం బాటరీ తో రెండు రోజుల పాటు పని చేస్తుంది, ఇక ఇది ఏదైనా ఒక యుఎస్బి ద్వారా దీనిని ఛార్జ్ చేయవచ్చు. సరే మరి దీనిని ఉతకడం ఎలా అంటే, ఈ పరికరాన్ని తీసేసి అన్ని దుస్తుల్లానే దీన్ని కూడా మీరు వాషింగ్ మెషిన్ లో ఉతుక్కోవచ్చు.
ఈ స్మార్ట్ జాకెట్, గూగుల్ వారి Jacquard టెక్నాలజీ తో రూపొందింది. ఈ జాకెట్ ను గూగుల్ మరియు Levi ఆస్టిన్ లో జరిగిన SXSW లో ప్రదర్శించారు. ఈ జాకెట్ మరి కొద్ది నెలల్లో అందరికీ అందుబాటులోకి రానుంది. దీని ధర $350.
ఈ స్మార్ట్ జాకెట్ టెక్స్టైల్ రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులకు కారణం కావచ్చు అని అంటున్నారు నిపుణులు.