ఫోన్లు స్మార్ట్ అయిన కొద్దీ మనకు సౌకర్యాలు పెరిగాయి. సౌకర్యాల మాటున అభద్రత కూడా పెరిగింది. ఎందుకంటే మనం నిత్యం ఫోన్లలో ఎన్నో యాప్ లను వాడుతుంటాం. ఎన్నో వీడియో లు చూస్తుంటాం, ఎన్నో లావాదేవీలు, వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరుస్తుంటాం. అయితే మనం నిత్యం డౌన్లోడ్ చేసే యాప్ లలో ఏవి నమ్మదగినవో, ఏవి కాదో సామాన్యులకు అంతు పట్టదు. కొన్ని యాప్ లు కొన్ని ఫీచర్లను ఏర వేసి వ్యక్తిగత సమాచారాన్ని, పాస్ వర్డ్ లను వేరే ప్రమాదకరమైన సర్వర్లకు పంపిస్తుంటాయి. కనీసం ఆ విషయం మనకు తెలిసే అవకాశం కూడా లేకపోవడం దురదృష్టకరం.
ఇదీ ఇప్పటి పరిస్థితి. ఇంతవరకూ ఏ యాప్ లేదా వెబ్ సైట్ యాక్సస్ చేయాలన్నా పాస్వర్డ్ ముఖ్యం. అయితే మన అవసరాలకు డౌన్లోడ్ చేసుకునే కొన్ని రకాల యాప్ ల వల్ల మనకు తెలియకుండానే మన పాస్వర్డ్ వేరే third party server లకు వెళ్లిపోతుంటాయి. దీనిని అరికట్టేందుకు Duke University కి చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ Landon Cox, స్మార్ట్ ఫోన్లలో వినియోగించేందుకు ఒక ప్రత్యకమైన software ను రూపొందించారు.
అదే ScreenPass. దీనిలో మనం ఒక ప్రత్యేకమైన కీబోర్డ్ లో ఒక సైట్ కు కానీ యాప్ కు కానీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే, ఈ సాఫ్ట్ వేర్ ఆ యాప్, మీ పాస్ వర్డ్ లను వేరే సర్వర్ కు పంపిస్తున్నప్పుడు గుర్తించి మీకు సమాచారమిస్తుంది. ఇందుకోసం మీరు ఖచ్చితంగా ఈ ScreenPass కు చెందిన కీబోర్డు లో మాత్రమే మీ పాస్ వర్డ్ టైపు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రత్యేకమైన బాక్స్ లో పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే ఈ software, ఈ పాస్వర్డ్ దేనికి చెందినదని అడుగుతుంది. అప్పుడు మనం జిమెయిల్, ఫేస్ బుక్ ఇలా కనిపించిన వాటిలో tick చేస్తే ఆ యాప్ కు మాత్రమే మీ పాస్ వర్డ్ చేరుతుంది.
అంతే కాదు ఈ software ఏ ఏ యాప్ లు దొంగతనంగా మీ పాస్ వర్డ్ లు అడుగుతున్నాయో కూడా గుర్తించగలిగింది. NetFlix వంటి యాప్ లకు డూప్ లు ఉన్నాయని అటువంటి వాటిని సులభంగా ఈ software కనిపెట్టేసింది. దీనిని Cox, తైపీ లో జరిగిన MobiSys 2013 లో ప్రదర్శించారు. దీనిని Cox బృందం 27 మంది ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లలో పరీక్షించగా ఇవి నకిలీ యాప్ లను సులువుగా కనిపెట్టేసింది.
దీనితో సులువుగా మీకు తెలియకుండానే మీ సమాచారాన్ని దొంగిలిస్తున్న దొంగ యాప్ లు, నకిలీ యాప్ లు, మీకు సురక్షితం కాని యాప్ లను గుర్తించి డిలీట్ చేయవచ్చు. ఈ విధంగా మీరు సైబర్ వీధుల్లో సురక్షితంగా విహారం చేయవచ్చు.
ఈ ScreenPass ను Cox త్వరలోనే అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా ఇటువంటివి అందరికీ ఎంతో అవసరం. ఈ లోపు మన ప్రయత్నంగా ఫోనులో యాప్ లను డౌన్లోడ్ చేసుకునేముందు ఒకటికి రెండు సార్లు అది సరైన సోర్స్ నుండి వచ్చినదేనా అని గమనించుకోవడం మంచిది.