ఈ 20వ శతాబ్దంలో పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఏ వస్తువు కేవలం వస్తువుగా ఉండిపోవడం లేదు. దాని వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఉదాహరణకు సెల్ ఫోనునే తీసుకుందాం. ఇది మొదట్లో కేవలం సమాచారాన్ని చేరవేయడానికి మాత్రమే దీనిని ఉపయోగించేవారు. మరి ఇప్పుడు. సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ అయ్యింది. అలాగే కంప్యూటర్, టీవి ఇంకా ఎన్నో వస్తువులు చాల విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఆ కోవలోకే రానుంది ఎలక్ట్రికల్ లైటు.
అమెరికాలోని కెనాల్ అనే సంస్థ “ఇండిగో క్లీన్” అనే లైటును తయారు చేసింది. ఈ లైటు కాంతిని ఇవ్వడమే కాకుండా దీనిలోని అతినీలలోహిత కిరణాలు, మనుషులకు ఎటువంటి హాని కలుగకుండా, హానికారక బాక్టీరియాను చంపేస్తాయి. దీని కాంతి చేరినంత మేర గాలి లోను, ఇంకా గదిలోని మరే ఇతర వస్తువు మీద బాక్టీరియాను లేకుండా చేస్తుంది. ఇది చూడటానికి సాధారణ ఎల్ఈడి లైటులానే వుంటుంది, కాని అంతటి కాంతిని ఇవ్వదు. ఇది సాధారణ లైటు ఫిక్స్చర్స్ అన్నిటిలోను సరిపోతుంది. దీనిని ఇళ్ళు, స్కూళ్ళు, ఇంకా జన సంచారం ఎక్కువ వుండే పబ్లిక్ టాయిలెట్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్ పోర్ట్స్ లలో వినియోగిస్తే, ఈ ప్రదేశాలన్నీ సురక్షితంగా వుంటాయి. ప్రస్తుతం ఈ లైటుకు కెనాల్ సంస్థ లైసెన్సు కలిగి వుంది.
ఇటువంటి పరికరాలను కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా కాస్త సామాజిక దృక్పధంతో ఆలోచిస్తే దీని పరిధి ఖండాలను దాటి విస్తరిస్తుంది. UNO మొదలైన అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చి వీటిని, అంతగా అభివృద్ధి చెందని ఆఫ్రికా మొదలైన దేశాల్లో పంపిణి చేస్తే, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.